అమరావతి రాజధానిని తరలిస్తే సహించం: బిజెపి

అమరావతి రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తే సహించేది లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజధాని మార్పుపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర, జాతీయ స్థాయి బీజేపీ నేతల బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 

రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య తదితరులు ఆ పర్యటనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి కన్నా మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులకు బీజేపీ పూర్తి అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిందని, అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న తాను రాజధానికి మద్దతిచ్చానని గుర్తు చేశారు. 

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా అప్పట్లో తన పాదయాత్ర సందర్భంగా రాజధాని ప్రాంతానికి వచ్చిన సమయంలో రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక మాట తప్పడమే కాక రాజధాని మార్పు అంశాన్ని బయటకు తెచ్చి మడమ తిప్పారని విమర్శించారు. 

అనేక విషయాల్లో రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎన్నో తప్పటడుగులు వేయడమే కాక తొందరపాటు నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటోందని కన్నా విమర్శించారు. రాజధాని విషయంపై ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాసినప్పటికీ జగన్ నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరిగిందని సీఎంకు మొట్టమొదటి లేఖ పంపితే జవాబు లేదని ధ్వజమెత్తారు. 

జగన్ ప్రభుత్వంలో అత్యుత్సాహం తప్ప పనులు కార్యరూపం దాల్చడం లేదని, అధికారంలో ఉన్నామని మర్చిపోయి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని కన్నా గర్హించారు. నిన్న మొన్నటి వరకు అవినీతి అంటూ విమర్శించిన వైసీపీ నేతలు నేడు అదే దారిలో పయనిస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతి జరిగిన చోట, అవినీతి పరులను శిక్షించకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలను డిమాండ్ చేశారు.

 ప్రజావేదిక అనేది చంద్రబాబు, జగన్ ఆస్తులు కావని, సొంత ఆస్తిగా దానిని కూల్చడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందని స్పష్టం చేశారు. ప్రజాధనానికి ప్రతి ఒక్కరూ కాపలాదారులే తప్ప యజమానులు కారని, ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజలు అధికారం ఇవ్వలేదని గమనించాలని కన్నా లక్ష్మీనారాయణ హితవుపలికారు.

రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రాజధాని నిర్మాణానికి మంచి మనసుతో ఈ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇస్తే జగన్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇక్కడి వాస్తవ పరిస్థితులు మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ఇచ్చిన సమాధానానికి భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

బొత్స బాధ్యతను మరచి ప్రజలు ఆందోళనకు గురి చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉంటుందని, అయితే 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామన్న వైసీపీ పెద్దలు చివరకు టీడీపీ హయాంలో కేటాయించిన గృహాలను కూడా రద్దుచేస్తామనడం నేరమని దయ్యబట్టారు. ఇలాంటి బాధ్యతా రాహిత్య చర్యలను బీజేపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. 

 ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ రైతులకు అండగా నిలుస్తుందని, అన్నదాతలెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు.