అవినీతిపై చర్యలు తీసుకోకుండా జగన్ తాత్సారం

అవినీతిపై చర్యలు తీసుకోకుండా జగన్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రం అవినీతిపరుల భరతం పట్టాల్సింది పోయి టెండర్లను రద్దు చేసి తనది కాని పని చేసిందని ధ్వజమెత్తారు. అవినీతి జరిగిందని రివర్స్ టెండర్లకు ఉపక్రమించినపుడు రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న చర్యలు చేపట్టకుండా, తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్సీ సోము ప్రశ్నించారు.

టెండర్ల రద్దు విషయమై పార్లమెంట్‌లో చట్టం నేపధ్యంలో ఏర్పడిన పీపీఎ కి ప్రతిపాదిస్తే, పీపీఏ నుంచి కేంద్రానికి వెళితే అక్కడ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెబుతూ ఈ విధానాన్ని రాష్ట్రం అవలంభించలేదని దయ్యబట్టారు. ఈలోగా రాష్ట్రం అవినీతిపరుల భరతం పట్టాల్సింది పోయి టెండర్లను రద్దు చేసి తనది కాని పని చేసిందని విమర్శించారు.

అవసరం లేక పోయినా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు, పరికరాలు కొనుగోలు చేసేశారని, దీనిపై రూ.200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. సబ్సిడీ పచ్చగడ్డి విషయంలో కూడా మరో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయని, పనికి ఆహార పధకంలో రూ.2,400 కోట్ల అవినీతి జరిగిందని సాక్షాత్తూ మంత్రే ప్రకటించడం జరిగిందని వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేవలం కొన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకే ప్రయత్నిస్తోందనే అభిప్రాయం బలపడుతోందని విచారం వ్యక్తం చేశారు.

దెయ్యాలు వేదాలు వల్లించేటట్టుగా జగన్మోహన్‌రెడ్డి చేశారని చెబుతూ టీడీపీ పేట్రేగిపోయేలా చేశారని, ఈ పరిస్థితిని బీజేపీ ఊహించలేదని స్పష్టం చేశారు. వెంటనే జగన్ ప్రభుత్వం సరిదిద్దు కోవాలని హితవు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఆలయ భూముల జోలికొస్తే బీజేపీ ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఇసుక, మద్యం పాలసీలను ప్రభుత్వం రెండూ కొత్తగా తీసుకొస్తోందని, అయితే బ్రాందీకి ఇబ్బందని కొనసాగిస్తున్నారా, ఇసుక ఇబ్బంది లేదనుకుని ఆపేసారా అని ప్రశ్నించారు..

రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలు కట్టి, పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీగానే బీజేపీ గుర్తిస్తుందని, ఇటువంటి చర్యలపైనే బీజేపీ 2024లో ఎన్నికలకు వెళ్లనుందని స్పష్టం చేశారు. దమ్ముంటే క్రైస్తవ భూములు ఇళ్ల కోసం తీసువాలని సోము సవాల్ చేశారు. చర్చిలకు ఎన్నో వేల ఎకరాల భూములు ఉన్నాయని చెబుతూ పరిపాలన అనేది మతపరమైన ఆలోచనకు విరుద్ధంగా ఉండాలని కోరారు. కర్నూలు, శ్రీశైలంలో కొంత మంది అన్యమతస్థులకు షాపులు ఇచ్చారని ధ్వజమెత్తారు.

టీటీడీ రూ.1200 కోట్లు బడ్జెట్ పెడితే అందులో రూ.100 కోట్లు ధర్మానికి, రూ.1100 కోట్లు అభివృద్ధికి, చంద్రబాబు బోర్డులో కేటాయించారని, ధర్మంలో కేటాయించిన రూ.100 కోట్లలో రూ.60 కోట్లు ఛానల్‌కు కేటాయించారని పేర్కొన్నారు. ధార్మిక పరిషత్ అనేది నిర్వీర్యం చేశారని, ఐదేళ్లుగా ఎవరినీ నియమించలేదని విమర్శించారు.

ధర్మానికి ప్రతీ సంవత్సరం రూ.100 కోట్లు పెట్టాలని డిమాండ్ చేశారు, 9, 10 పిల్లకు స్కూళ్లలో హిందూ భావజాలాన్ని , భారత ఆజ్ఞాత్మికతను అర్ధం చేసుకోవాలనే విధానాన్ని చంద్రబాబు రద్దు చేశారని, ఈయన ఉంచుతారా అనేది ప్రశ్నార్ధకమన్నారు. చంద్రబాబునాయుడు మాయాజాలంలో చిక్కుకుని అందరూ రాజధాని గురించి మాట్లాడుతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు కేంద్రం ఇస్తే అసెంబ్లీ హాలులో కనీసం ఒకరు వెళితే మరొకరు తప్పించుకోలేని విధంగా ఉండే వాష్‌రూమ్‌లు కట్టారని దుయ్యబట్టారు.