సింధు నిజమైన చాంపియన్..ఆమెను చూసి దేశం గర్విస్తుంది

సింధు నిజమైన చాంపియన్ అని, ఆమెను చూసి భారత దేశం గర్వ పడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకుంది. 

ఇక్కడి విమానాశ్రయంలో సింధుకు ఘన స్వాగతం లభించింది. ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి సింధు ఢిల్లీకి చేరింది. ఆమెకు ఎయిర్‌పోర్ట్‌లో భారత బ్యాడ్మింటన్ సమాఖ్య, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సింధు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలుసుకుంది. 

ఈ సందర్భంగా తాను సాధించిన పతకాన్ని ప్రధానికి చూపించింది. కాగా, ప్రధాని మోడీ తెలుగుతేజం సింధును, ఆమె కోచ్ గోపీచంద్‌ను అభినందించారు. అంతేగాక సింధు మెడలో స్వర్ణ పతకాన్ని వేసి సత్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ స్వర్ణ పతకంతో సింధు భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని ప్రశంసించారు. 

భారత్‌కు లభించిన క్రీడా ఆణిముత్యాల్లో సింధుది అగ్రస్థానమని ప్రధాని కొనియాడారు. అపార ప్రతిభావంతురాలైన సింధు భవిష్యత్తులో ఇలాంటి పతకాలు ఎన్నో గెలుచుకుంటుందని ఆకాంక్షించారు. కాగా, సింధుతో దిగిన ఫొటోలను ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజుజును కూడా సింధు, గోపీచంద్‌లు కలుసుకున్నారు.