జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోదీ

అనారోగ్యంతో కన్నుమూసిన  బిజెపి సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కుటుంబసభ్యులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పరామర్శించారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్‌లను ప్రధాని ఓదార్చారు. 

ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. జైట్లీతో తనకున్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.   

విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున దిల్లీ చేరుకున్న మోదీ.. ఈ ఉదయం జైట్లీ నివాసానికి వెళ్లారు. అప్పటికే జైట్లీ ఇంటివద్ద ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మోదీని వెంట తీసుకెళ్లారు. 

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ చికిత్స పొందుతూ గత శనివారం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటనలో ఉన్నారు. జైట్లీ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుటుంబసభ్యులతో మోదీ ఫోన్లో పరామర్శించారు. 

అయితే ఈ కారణంగా విదేశీ పర్యటన అర్ధంతరంగా రద్దు చేసుకోవద్దని జైట్లీ కుటుంబసభ్యులు మోదీని కోరారు. దీంతో మోదీ తన పర్యటనను కొనసాగించారు. నేడు స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత.. జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు.