రాజధానిపై జగన్ కు ఆయుధంగా చంద్రబాబు అఫిడవిట్ !

రాజధాని అమరావతి నిర్మాణంలో తలెత్తిన వివాదంలో తన ప్రభుత్వ వైఖరిని సమర్ధించుకోవడానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్ ను ఆయుధంగా వాడుకొంటున్నట్లు తెలుస్తున్నది. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయమై వ్రాసిన లేఖలో ఆ అఫిడవిట్ ప్రతిని జత చేసిన్నట్లు చెబుతున్నారు. 

పైగా, రాజధాని నిర్మాణం పట్ల గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లేవనెత్తిన అభ్యంతరాలను సహితం జగన్ తన లేఖలో ప్రధానికి పంపినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణ ఖర్చు అనూహ్యంగా పెరిగిపోవడానికి, నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతుండటానికి కారణాలను పేర్కొంటూ ఈ వివరాలను అందచేసినట్లు తెలిసింది. రాజధానిపై తమ ప్రభుత్వమేమి కొత్త విషయాలను మాట్లాడటం లేదని, గత ప్రభుత్వం చెప్పిన అంశాలనే ప్రస్తావిస్తున్నామని ఈ లేఖ లో పేర్కొన్నట్లు తెలిసింది.

రాజధాని ముంపు సమస్య, పర్యావరణవేత్తల అభ్యంతరాలు, ఉన్నత న్యాయస్థానం, గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లు, వాటిపై అప్పటి ప్రభుత్వ వాదనలను వివరించిన ముఖ్యమంత్రి ఆ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారని తెలిసినది. 

అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో కొందరు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వివరణ కోరగా, భారీ వరదలొస్తే 13 వేల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ముంపునకు గురవుతాయని చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. 29 గ్రామాల పరిధిలో 34 వేల ఎకరాలు సేకరించగా అందులో మూడవ వంతుకు మాత్రమే ముంపు ప్రమాదం ఉందని, దానిని కూడా నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. నది గర్భం నుండి 25 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు చేపడతామని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు తెలిపింది.

ముంపు నకు గురయ్యే ప్రాంతాల్లోనే చంద్రబాబు శాశ్వత పరిపాలన భవనాలకు శంకుస్థాపన చేశారని, ముంపు బారి నుండి తప్పించడానికి వంద అడుగుల లోతులో ర్యాప్టు ఫౌండేషన్‌ టెక్నాలజీతో 40 నుంచి 50 టవర్ల భవనాలు ఐదింటిని నిర్మించేందుకు పనులు ప్రారంభించారని, ఫలితంగా ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని జగన్ ప్రధానికి వివరించినట్లు తెలిసింది. 

ఇటీవల వచ్చిన వరదతో రాజధానిలోని కీలక ప్రాంతా లపై బోరుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల్లోని నదీపరివాహక ప్రాంతాలు ముంపునకు గురయిన విషయం తెలిసిందే! కొన్ని రోజులుగా మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. 

మరోవైపు తుళ్లూరు మండలంలో ముంపునకు గురయ్యే గ్రామాల కంటే తమ ప్రాంతంలో రాతి నేలలు చాలా ఉన్నాయని, రాజధాని పనులు ఇక్కడే చేపట్టాలని మంగళగిరి ఎంఎల్‌ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేస్తు న్నారు. ఈ నేపధ్యంలో కొందరు టిడిపి నేతలు రాజధాని ప్రాంతంలో అసలు ముంపే లేదని వాదిస్తుండటం గమనార్హం.