పోలవరం చేపట్టే యోచన కేంద్రానికి లేదు

పోలవరం ప్రాజెక్టు చేపట్టాలన్న యోచనేదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు.  . పోలవరం ప్రాజెక్టు అథారిటీ పంపిన నివేదిక అందిందని, పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును మీరే చేపట్టబోతున్నారా అని ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇప్పటికి అలాంటి ప్రణాళిక లేదు (నో ప్లాన్‌ ఎట్‌) అని చెప్పారు. 

మరోవైపు, పోలవరం ప్రాజెక్టుపై విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని షెకావత్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టు, రాష్ట్రం, దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం సందర్భంగా తేల్చి చెప్పారు. 

జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి లోపలికి వెళ్లినప్పటికీ ఆయన దూరంగా కూర్చున్నారు. అరగంట పాటు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రులే మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో జగన్‌ కేంద్రమంత్రికి తన వాదనను వినిపించడానికే పరిమితం అయ్యారని, షెకావత్‌ ఎలాంటి నిర్ణయమూ వెల్లడించలేదని తెలిసింది. 

ప్రస్తుతం పోలవరం విషయంలో తాను తీసుకున్న నిర్ణయం సరైందేననే వాదనను కేంద్రమంత్రికి చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గజేంద్రసింగ్‌ షెకావత్‌ తన అభిప్రాయం ఏమీ చెప్పకుండా... తాను ఈరోజు స్టాక్‌హోం వెళ్తున్నానని, తర్వాత దీనిపై సమీక్షించి నిర్ణయం చెబుతానని అభిప్రాయపడినట్లు తెలిసింది.