మైనింగ్‌ అక్రమార్కులకు కేసీఆర్ ప్రభుత్వం వత్తాసు

అక్రమ మైనింగ్‌ వ్యాపారులకు తెలంగాణలోని కేసీఆర్  ప్రభుత్వం సహకరిస్తూ, కేంద్ర చట్టాన్ని ధిక్కరిస్తోందని.. మైనింగ్‌ సంస్థల అక్రమాల్ని అధికారులు నిర్ధారించినా చర్యలు తీసుకోవట్లేదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర గనుల మంత్రి ప్రహ్లాద్‌ జోషికి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. 

ఆర్థిక నేరాలకు పాల్పడిన గనుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడంతోపాటు వారి నుంచి రావల్సిన మొత్తాన్ని రాబట్టాలని.. 2008 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. తెలంగాణలో వందల క్వారీల నుంచి అనుమతుల్లేకుండా పరిమితికి మించిన గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తున్నారని..ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల తమ జేబులు నింపుకొంటున్నారని ఆయన ఆరోపించారు.

‘‘2008-11 మధ్య కరీంనగర్‌ జిల్లాలోని 8 మైనింగ్‌ ఏజెన్సీల అక్రమాల్ని అధికారులు నిర్ధారించారు. రైళ్లు, కాకినాడ పోర్టు నుంచి చైనాకు గ్రానైట్‌ను ఎగుమతి చేశారు. దాన్ని గుర్తించి రూ.124.94 కోట్ల సీనరేజ్‌ ఫీజు.. దానిపై ఐదింతల పెనాల్టీ రూ.624.73 కోట్లు కలిపి రూ.749.66 కోట్లు కట్టాలని మైనింగ్‌ శాఖ 2016లో డిమాండ్‌ నోటీస్‌లిచ్చింది. ఇప్పటివరకు ఏ ఒక్కరూ ఆ డబ్బు కట్టలేదు" అని ఆయన తెలిపారు. 

ఈ క్రమంలో అప్పట్లో గనులశాఖ మంత్రిని ఆ శాఖ నుంచి తప్పించారని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయని ధ్వజమెత్తారు. మైనింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా పెనాల్టీని 4 రెట్లు తగ్గించి ఆ సంస్థలకు లబ్ధి కలిగించారని ఆరోపించారు. చెక్‌ పోస్టులనూ ఎత్తేశారని సంజయ్‌ తెలిపారు. 

ఈ అక్రమాలపై రాష్ట్ర గవర్నర్‌, ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెబుతూ సీబీఐ, ఈడీ సంస్థలతో విచారణ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.