10 జిల్లాల్లోనే మావోయిస్టు సమస్య

దేశవ్యాప్తంగా కేవలం 10 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల సమస్య ఎక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్ర హోంశాఖ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో భద్రత, అభివృద్ధి, గిరిజన హక్కులపై చర్వహించారు. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి హోంశాఖ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఈ సమస్యను నివారించేందుకు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను స్థానికులకే అప్పగించాలని సమావేశం నిర్ణయించింది. 

ఇప్పటి వరకు ఉన్న పరిమితిని రూ.5లక్షలకు రూ.50లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో బ్యాంకులు, టవర్లు, తపాలా సేవలు అందుబాటులోకి తేవాలని ఈ భేటీలో నిర్ణయించారు. అభివృద్ధి తప్ప మరో అంశానికి తావు ఉండకూడదని అమిత్‌షా స్పష్టం చేశారు. అవకాశం ఉన్న ప్రతి చోటా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.   గిరిజన ప్రాంతంలో ప్రత్యేక మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.

 ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పాలని సూచించారు. విజయనగరం జిల్లా సాలూరులో ఓ ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.