కాంగ్రెస్‌ను సమాధి చేసిన అధీర్ రంజన్

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరిపై జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో అధీర్ తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని సమాధి చేశారని అన్నారు. ఆయనకు ఉన్న పరిజ్ఞానం గురించి అంతకంటే తాను చెప్పేదేమీ లేదని పేర్కొన్నారు. 

గవర్నర్‌గా అత్యంత జాగరూకతతో బాధ్యతలను నిర్వహిస్తున్నాననీ, అధీర్ చేసిన ఆరోపణలను తాను పట్టించుకోనవసరం లేదని సత్యపాల్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

దీనికి ముందు, అధీర రంజన్ చౌదరి గవర్నర్ మాలిక్‌పై పదునైన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలు బీజేపీ వాళ్లు చెప్పించినట్టుగా ఉన్నాయని, జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారని నిశితంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సత్యపాల్ మాలిక్ మండిపడుతూ, ఆయనకు (అధీర్) ఉన్న పరిజ్ఞానం ఏమిటో పార్లమెంటులోనే చూశామని, కాంగ్రెస్ పార్టీకి సమాధికట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. 

ఒక గవర్నర్‌గా పూర్తి అంకితభావంతో పనిచేస్తున్న తాను ఎలాంటి ఆరోపణలను ఖాతరు చేయనని స్పష్టం చేశారు. కశ్మీర్ ప్రజల సంస్కృతి, గౌరవం, గుర్తింపు, ఉద్యోగాలు, భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితిలు కశ్మీర్‌లో తలెత్తాయని, చివరకు గులాం నబీ ఆజాద్ హయాంలోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మొదటి వారంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 

అయితే తాము మాత్రం కశ్మీర్‌కు చెందిన ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోరాదన్నదే పట్టుదలతో ఉన్నామని, ఈ విషయంలో తమకు ఎలాంటి తొందరపాటు లేదని చెప్పారు. కశ్మీరీ ప్రజల ప్రాణాలు తమకెంతో విలువైనవని గవర్నర్ తెలిపారు.