ప్లాస్టిక్ కవర్లపై వార్.. ప్రధాని పిలుపు

ప్లాస్టిక్ కవర్ల ముప్పు నుంచి దేశ పర్యావరణాన్ని పరిరక్షించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపిచ్చారు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ కవర్లతో పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి నేపథ్యంలో అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఈ సింగిల్ యుజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉందని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన దేశ ప్రజలనుద్ధేశించి ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. 

పటిష్ట భారతదేశమే లక్షంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. జాతీయ క్రీడాదినోత్సవం పురస్కరించుకుని చేపట్టే ఫిట్ ఇండియా వివరాలను ఈ నెల 29వ తేదీనే వెల్లడించనున్నట్లు ప్రధాని తెలిపారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని స్ఫూర్తివంతంగా, మహా ఉత్సవంగా నిర్వహించేందుకు దేశం సమాయత్తం అవుతోందని చెప్పారు.

గాంధీ జయంతి సందర్భంగా ప్రజలంతా కూడా ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిన వహించాల పిలుపు నిచ్చారు. భారీ స్థాయిలో ప్లాస్లిక్ వ్యర్థాలు వచ్చి చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని ప్రధాని సూచించారు. దీపావళికి ముందే ఈ వ్యర్థాల సురక్షిత తొలిగింపునకు మున్సిపాల్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల వారు ఒక సవ్యమైన మార్గాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. 

దుస్తులు, ఆహార పదార్థాలు వంటివి ప్లాస్టిక్ కవర్‌లలో ఉంచి అమ్మడం వాటి వాడకం కాగానే తీసి బయట పారేయడంతో టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు జమ అవుతున్నాయి. ఈ పద్ధతిని నివారించాల్సి ఉందని ప్రజలకు ప్రధాని పిలుపు నిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వస్తువుల సరైన సేకరణ, వాటి నిల్వల చర్యలు అవసరం అన్నారు. దుకాణదార్లు వినియోగదారులకు పర్యావరణ హిత సంచులు అందించడం మంచిదని, దీని వల్ల ప్లాస్టిక్ వాడకం తగ్గుతుందని తెలిపారు.

మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని తన టీవీ షో మ్యాన్ వర్సెస్ వైల్డ్ గురించి ఒక రహస్యం చెప్పారు. జిమ్ కార్బెట్ అడవులలో హిందీలో మాట్లాడితే హిందీ ముక్క కూడా రాని షో సమర్పకుడు బేర్ గ్రిల్‌కు ఏ విధంగా అర్థం అయిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారని పేర్కొంటూ టెక్నాలజీ సాయంతో తన భాష ఆయనకు అర్థం అయిందని, వెంటవెంటనే ఆంగ్లంలోకి తర్జుమా అవుతూ వచ్చిందని వివరించారు. ఆయన ఒక చిన్నపాటి కార్డులెస్ పరికరాన్ని చెవులకు పెట్టుకున్నారని, దీనితో తాను హిందీలో మాట్లాడినది వెంటనే ఆయనకు ఇంగ్లీషులోకి మారి చేరేదని, దీనితో మా ఇద్దరి మధ్య ఎటువంటి భాషా దూరం లేకుండా పోయిందని చెప్పారు.

ఇది సాంకేతిక పరిజ్ఞానపు గొప్పతనం అని తెలిపారు. ఈ కార్యక్రమం చూసిన వారందరికి తాను చేసే విజ్ఞప్తి ఒక్కటే అని ప్రకృతితో, వన్యప్రాణులతో విస్తరించుకుని ఉండే ప్రాంతాల సందర్శనకు వెళ్లండి, జీవ వైవిధ్యతలోని గొప్పదనాన్ని అందరికి పంచండి ..ప్రత్యేకించి మనమంతా జీవితంలో ఒక్కసారి అయినా ఈశాన్య భారతంలో పర్యటించి వస్తే బాగుంటుంది. ప్రకృతి గొప్పదనం, గొప్పదైన ప్రకృతిలో మనం అంతర్భాగం కావడం వంటి పలు విషయాలు తెలిసివస్తాయని ప్రధాని పిలుపు నిచ్చారు. అభయారణ్యంలో కలియతిరగడం, శీతల నదిలో పడవ షికారు వెంట సాహసికుడితో సరదా ముచ్చట్లు వంటివి పర్యావరణ పరిరక్షణకు తన తపనలో భాగమేనని ప్రధాని తెలిపారు.