ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడాన్ని తిరస్కరించాలి

   ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడాన్ని తిరస్కరించాలని అంతర్జాతీయ సమాజానికి భారత్‌, బహ్రెయిన్‌ పిలుపునిచ్చాయి. భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. రెండు రోజుల బహ్రెయిన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆ దేశ రాజు హమిద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా, ప్రధాని, యువరాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో సమావేశమయ్యారు. 

భేటీ అనంతరం సంయుక్త ప్రకటన వెలువడింది. ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని వినియోగించడాన్ని తిరస్కరించాలని, ఉగ్ర శిబిరాలను అంతం చేయాలని, ఉగ్రవాదులకు చేరే నిధులకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రచర్యలకు పాల్పడేవారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్ని దేశాలకూ పిలుపునిచ్చారు. పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ ఈ ప్రకటన చేశారు. సైబర్‌ సెక్యూరిటీ, భద్రత, కౌంటర్‌ టెర్రరిజం, నిఘా, సమాచార రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రాంతీయ అనుసంధాన ప్రాజెక్టులు చేపట్టాలని పరోక్షంగా చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ని (బీఆర్‌ఐ) ప్రస్తావించాయి. సముద్ర భద్రత, మానవ వనరుల శిక్షణ, ఎనర్జీ, వాణిజ్యం, ఉన్నత విద్య, రక్షణ రంగాల్లో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. 

కాగా, అంతర్జాతీయ సౌర కూటమిలో బహ్రెయిన్‌ చేరడాన్ని భారత్‌ స్వాగతించింది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు, మెరుగైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేకించి భద్రతా మండలిలో తక్షణం సంస్కరణలు చేపట్టాలని ఇరు దేశాలు కోరాయి. సాంస్కృతిక, అంతరిక్ష సాంకేతికత, సౌరశక్తి రంగాల్లో రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అలాగే రూపే కార్డు ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం భారత్‌కు చెందిన ఎన్‌పీసీఎల్‌, బహ్రెయిన్‌కు చెందిన బెనెఫిట్‌ మధ్య మరో ఎంవోయూ కుదిరింది. 

కాగా, బహ్రెయిన్‌లో పర్యటించిన భారత తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. ఇరుదేశాల మద్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగానూ ప్రధాని మోదీకి బహ్రెయిన్‌ రాజు హమిద్‌ ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ద కింగ్‌ హమద్‌ ఆర్డర్‌ ఆఫ్‌ రినైసాన్స్‌'తో సత్కరించారు. 

ఇలా ఉండగా, బహ్రెయిన్‌లోని 200 ఏండ్లనాటి శ్రీనాథుడి (శ్రీకృష్ణుడు) ఆలయాన్ని 4.2 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.30 కోట్లు) వ్యయంతో పునరుద్ధరించే ప్రాజెక్టును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. మనామాలోని ఈ ఆలయంలో ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. రూపేకార్డు ద్వారా ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. ఆలయానికి వచ్చిన ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. భారత్‌, బహ్రెయిన్‌ మధ్య బలమైన సంబంధాలకు ఈ ఆలయం ప్రతీక అని పేర్కొన్నారు. దాదాపు 3,50,000 మంది భారతీయులు బహ్రెయిన్‌లో నివసిస్తున్నారు.