అధికార లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు

తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్ జైట్ల్య్ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగం బోధ్ ఘాట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. 

అంతకుముందు అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్‌, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక దివంగత నేత భౌతికకాయాన్ని  స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోం మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,  బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌, కాంగ్రెస్‌ నేతలు మోతీలాల్‌ వోరా, కపిల్ సిబల్, ఎన్సీపీ నేతలు శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, ఆర్‌ఎల్డీ నేత అజిత్‌ సింగ్‌, జమ్మూకశ్మీర్  గవర్నర్ సత్యపాల్ మాలిక్, రాందేవ్ బాబా తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఉండటంతో స్వయంగా ఆయన తరఫున రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  

 మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  66 సంవత్సరాల అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో  ఈ నెల 9 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో బాధపడుతున్నారు.

అరుణ్‌ జైట్లీ మృతిపై కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చివరి వరకు ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడి అరుణ్‌ జైట్లీ పోరాట పటిమను ప్రదర్శించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను అని పేర్కొన్నారు.