బహ్రెయిన్‌ లో 250 మంది భారతీయుల విడుదల

గల్ఫ్‌ దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశానికి వచ్చిన సందర్భంగా బహ్రెయిన్‌ ప్రభుత్వం అక్కడ జైళ్లలో ఉన్న భారతీయులను మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. బహ్రెయిన్‌ ప్రభుత్వం మానవతా దృక్పథంతో అక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 250 మంది భారతీయులను విడుదల చేసినందకు గానూ ఆ దేశ రాజు హమద్‌ బిన్‌ ఇసా ఖలీఫాకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. 

బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ కార్యాలయం ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసింది. ‘గల్ఫ్‌ జైళ్లలో మొత్తం భారతీయులు ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియదు. కానీ బహ్రెయిన్‌ ప్రభుత్వం మాత్రం తమ దయాగుణం, మానవతా దృక్పథంతో బహ్రెయిన్‌ జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 250 మంది భారతీయులను విడుదల చేసినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొంది. 

విదేశీ జైళ్లలో ఉన్న భారతీయులకు సంబంధించి అధికారికంగా ఉన్న సమాచారం ప్రకారం.. మొత్తం 8189 మంది భారతీయులు పలు విదేశాల్లో కారాగారాల్లో శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో సౌదీ అరేబియాలో అధికంగా 1811 మంది, యూఏఈలో 1392 మంది ఉన్నట్లు సమాచారం. 

ప్రధాని మోదీ గల్ప్‌ దేశాల పర్యటనలో భాగంగా శనివారం యూఏఈకి వెళ్లారు. అక్కడ మోదీని ఆ దేశ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయోద్ అల్‌ నాహ్యాన్‌ అక్కడి అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’తో సత్కరించిన విషయం తెలిసిందే. అనంతరం బహ్రెయిన్‌ పర్యటనకు వెళ్లారు. భారతదేశం నుంచి మొట్టమొదటి సారి బహ్రెయిన్‌ పర్యటనకు వెళ్లిన తొలి ప్రధాని నరేంద్రమోదీ కావడం విశేషం.