ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో సత్తా చాటిన ఏబీవీపీ..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ అభ్యర్ధులు ఘన విజయం సాధించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, సంయక్త కార్యదర్శి పదవులను కైవసం చేసుకున్నారు. దానితో కొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలకు వెళ్ళబోతున్న బిజెపి వర్గాలు సంబరం చేసుకొంటున్నాయి. గత రెండు దశాబ్దాలకు పైగా ఎన్నికల ముందు ఈ యూనివర్సిటీ ఎన్నికలలో ఎవ్వరైతే గెలుపొండుతున్నారో, సాధారణ ఎన్నికలలో కుడా వారే గెలుపొంది, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు.

 అధ్యక్ష పదవికి పోటీ పడిన అంకివ్ బసోయా ఎన్ఎస్‌యూఏకి చెందిన సన్నీని 1, 744 ఓట్ల తేడాతో ఓడించారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన శక్తి సింగ్ ఎన్ఎస్‌యూఐకి చెందిన ఆకాశ్ చౌదరిని 7,673 ఓట్ల తేడాతో ఓడించారు. సంయుక్త కార్యదర్శిగా పోటీ చేసిన జ్యోతి చౌదరి 19, 353 ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల్లో ఎన్ఎస్‌యూఐ ఒక కార్యదర్శి పదవిని మాత్రం చేజిక్కించుకుంది.

2014 లోక్ సభ ఎన్నికల ముందు కుడా ఇదేవిధమైన ఫలితాలు రావడం గమనార్హం. 1997, 1998, 2003, 2008, 2013లలో ఈ విద్యార్ధి సంఘం ఎన్నికలలో గెలుపొందిన వారే తదుపరి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిగా నరేంద్ర మోడీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన  2013లో కుడా ఎబివిపి ఇప్పటి వలే అద్యక్ష, ఉపాద్యక్ష, సహాయ కార్యదర్శి పదవులను గెలుపొందింది.

ఆ మరుసటి సంవత్సరం మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపియే ప్రభుత్వాన్ని బిజెపి నాయకత్వంలోని ఎన్డియే ఓడించడం, నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. 543 లోక్ సభ స్థానాలలో ఎన్డియే 325 స్థానాలను గెలుచుకోగా, బిజెపి సొంతంగా 282 సీట్లు గెల్చుకొని, మెజారిటీకి అవసరమైన 272 సీట్లకన్నా పది సీట్లను అదనంగా గెల్చుకొంది.

1997లో ఢిల్లీ యూనివర్సిటీలో ఎబివిపి అన్ని నాలుగు స్థానాలను గెల్చుకొంది. ఆ మరుసటి సంవత్సరం లోక్ సభ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్డియే గెలుపొందటం, ప్రధానిగా వాజపేయి పదవి చేపట్టడం జరిగింది. అట్లాగే, 1998లో ఎబివిపి కీలకమైన  అద్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులను గెల్చుకోగా, ఆ మరుసటి సంవత్సరం వాజపేయి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లి, అధికారాన్ని నిలబెట్టుకొంది.

ఇలా ఉండగా, 2003లో మొత్తం నాలుగు పదవులలో ఎబివిపి ఓటమి చెంది, ఎన్ఎస్‌యూఐ అన్ని పదవులను గెల్చుకొంది. ఆ మరుసటి సంవత్సరం 2004లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో వాజపేయి ప్రభుత్వం పరాజయం చెంద, కాంగ్రెస్ నాయకత్వంలోని యుపియే ఆధిక్యత పొందటం, డా. మన్మోహన్ సింగ్ ప్రధాని కావడం తెలిసిందే.

2008లో కుడా ఎబివిపి అద్యక్ష పదవిని పొందినా, మిగిలిన మూడు పదవులలో ఓటమి చెందింది. దానితో 2009 ఎన్నికలలో తిరిగి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపియే అధికారంలోకి వచ్చింది. జాతీయ రాజకీయాలను ప్రతిబింబించే ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధి సంఘ ఎన్నికలు రాజకీయంగా కీలక ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నాయి.