అమరావతి రైతులకు ఆందోళన వద్దు

రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్‌ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిజెపి ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ఈ విషయంలో న్యాయపరంగా ఆయనను కలవాలని రైతులకు సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు బిజెపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

రాజధాని ప్రాంత రైతుల బృందం ఆయనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటిని మనం మార్చలేమని, అంతమాత్రాన రాజధానిని మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందనే వ్యాఖ్యలు దురాలాచోనతో చేసినవిగానే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సుజనా చౌదరి చెప్పారు. గతంలో రాజధానికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని, ఏపీని ప్రత్యేకంగా చూడడం వల్లే రాజధానికి నిధులు వచ్చాయని తెలిపారు. మోదీ, అమిత్‌షాలను సంప్రదించే సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో నిజం లేదని సుజనా స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినతిపత్రాలు ఇవ్వడం నిత్యం జరిగేదే అని, అంతమాత్రాన అన్నీ చెప్పే చేశామడంలో అర్థం లేదన్నారు. . కాగా, రాజధానిలో తనకు గజం స్థలం కూడా లేదని సుజనా చౌదరి స్పష్టంచేశారు.