కాశ్మీర్ లో రక్తపాతం కోరుకొంటున్న కాంగ్రెస్!

కశ్మీర్‌లోయలో రక్తపాతాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుకుంటున్నారని జమ్మూకశ్మీర్‌ బీజేపీ విభాగం చీఫ్ రవీందర్ రైనా ఆరోపించారు. 370 అధికరణ రద్దుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక యువకులను విపక్ష పార్టీ రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. 

'ఈ నాయకులంతా జమ్మూకశ్మీర్, లడఖ్‌ను సందర్శించి శాంతి, సామర్యం నెలకొనాలంటూ పిలుపునిస్తారని ఆశిస్తున్నాం. గత 15 రోజులుగా వాళ్లు యువకులను రోడ్లపైకి వచ్చేలా రెచ్చగొడుతున్న విషయాన్ని మేము గమనించాం. కశ్మీర్ లోయలో రక్తపాతాన్ని కాంగ్రెస్ వాళ్లు కోరుకుంటున్నారు' అని ఆరోపించారు. 

 పవిత్రమైన కృష్ణ జన్మాష్టమి రోజు కాంగ్రెస్ నేతలు, ఇతర వామపక్ష నేతలు శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం, ఐక్యత, దేశభక్తి సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని రైనా సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్, వామపక్షాలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదానికి మద్దతిస్తున్నాయని మండిపడ్డారు.

కాగా, రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలతో కూడిన ప్రతినిధి బృందం కశ్మీర్‌లోయలో పరిస్థితిని తెలుసుకునేందుకు  ఇవాళ మధ్యాహ్నం శ్రీనగర్ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే అధికార యంత్రాంగం వారిని గంటసేపు నిలువరించింది. అనంతరం విపక్ష బృందాన్ని తిరిగి ఢిల్లీకి పంపించేసింది. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, టీఎంసీ, ఎన్‌సీపీ, జేడీ(ఎస్) నేతలు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.