దేశం కోసం నిరంతరం సేవ చేసిన నేత జైట్లీ

‘అరుణ్‌ జైట్లీ రాజకీయ దిగ్గజం. అత్యున్నత మేధో సంపత్తి గల వ్యక్తి. దేశం కోసం నిరంతరం సేవ చేసిన నేత. సమాజంలోని అన్ని రంగాల ప్రజలకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారత రాజ్యాంగం, చరిత్ర, ప్రజా విధానాలు, పాలనా వ్యవహారాలపై సునిశిత విజ్ఞానం ఆయన సొంతం' అంటూ విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జైట్లీ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 

జైట్లీ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ కారణంగా విదేశీ పర్యటనను అర్ధంతరంగా ముగించొద్దని జైట్లీ కుటుంబసభ్యులు మోదీని కోరినట్లు తెలిసింది. మోదీ ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు.  

‘‘జైట్లీ ఇకలేరనే వార్త నన్ను ఎంతో బాధకు గురిచేసింది. గొప్ప వ్యక్తుల్లో జైట్లీ ఒకరు. ఎంతో కాలంగా ఇద్దరం కలిసి ప్రజాసేవలో ఉన్నాం. జైట్లీ రాజకీయ జీవితంలో ఎన్నో అత్యన్నత పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారు. సమస్యను వెంటనే అర్థం చేసుకుని పరిష్కరించగల సమర్థవంతమైన వ్యక్తి జైట్లీ" అని ప్రధాని పేర్కొన్నారు. 

సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు. అలా దేశ ఆర్థిక వృద్ధి, రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించారు. బిజెపికి,  జైట్లీకి విడదీయరాని అనుబంధం ఉందని వరుస ట్వీట్ లలో ప్రధాని నివాళులు అర్పించారు. 

విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే దేశం కోసం పాటుపడ్డారని, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎంతో శ్రమించారని అంటూ  ఆయన మృతి విచారకరం. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానాని మోదీ సంతాపం తెలిపారు