ఏపీలో నిర్మాణం ప్రారంభం కాలేదు కానీ విధ్వంసం

ప్రజలలో ఎన్నో ఆశలు కల్పించి అధికారమలోకి వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో నిర్మాణం ప్రారంభం కాలేదు కానీ విధ్వంసం జరుగుతోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ తప్పులను సరిచేసేందుకు సహకరిస్తామని చెబుతూ  ప్రజల ఆకాంక్షలు నెరవేరకుంటే ప్రతిపక్షపాత్ర పోషిస్తామని.. పోరాటాలు చేసేందుకు కూడా సిద్ధమేనని తిరుపతిలో వెల్లడించారు. 

బీజేపీ రిమోట్‌ కంట్రోల్‌ పార్టీ కాదని రాంమాధవ్‌ స్పష్టం చేశారు.  గడిచిన 2 నెలల్లో చాలామంది ప్రముఖులు బిజెపిలో చేరారని గుర్తు చేశారు. తిరుపతిలో రామ్‌మాధవ్‌, ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ సమక్షంలో టిడిపి  సీనియర్‌నేత సైకం జనార్ధన్‌రెడ్డి బిజెపిలో చేరారు. గతంలో ఆయన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా పని చేశారు. 

జనార్ధన్‌రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా రాం మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుందని ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ 70 రోజుల పాలన ఎలా ఉందో ప్రజలు చూశారని, ఏం జరుగుతుందో బేరీజు వేసుకుంటున్నారని రాంమాధవ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ నూతన పాలన కోరుకొంటున్నారని స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం ఉన్నవాళ్లయితే అధికార వైసిపిలో చేరుతారని, దేశ ఉజ్వల భవిష్యత్‌ కాంక్షించేవాళ్లు మాత్రం బిజెపిలో చేరుతారని ఆయన చెప్పారు. 

దేశ వర్తమానం..భవిష్యత్‌ ప్రధాని మోదీయే అని పేర్కొంటూ సామాజిక సమస్యలు లేని నిర్మాత్మక భారతదేశమే మోదీ లక్ష్యమని తెలిపారు. గడిచిన 70 రోజుల్లో మోదీ చూపించిన సత్తానే దీనికి కారణమని రాంమాధవ్‌ పునరుద్ఘాటించారు. ట్రిపుల్‌ తలాక్‌, 370 ఆర్టికల్‌ రద్దు వంటివి మోదీ విజన్‌కు నిదర్శనమని ఆయన కొనియాడారు. 

శుక్రవారం రాత్రి తిరుపతికి చేరుకున్న రామ్ మాధవ్ కు బిజెపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడుతున్న ఆర్టీసీలో టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో రాయలసీమ నుండి అనేక మంది నాయకులు బీజేపీలో చేరారని చెప్పారు. 

అభివృద్ధిని కాంక్షించేవారు ఏపార్టీకి చెందినవారైనా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు. దేశ భవిష్యత్ కోసం తమతో కలిసి పనిచేయడానికి ప్రముఖ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.