తిరుమలలో అన్యమత ప్రచారంపై బిజెపి ధర్నా

ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రకటనలను నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు, నాయకులు ఆందోళనకుదిగి, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించగా, మరోవంక తిరుమలలో అన్యమత ప్రచారంపై విచారణకు ఆదేశించినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. వివాదాస్పద టికెట్ల ముద్రణ టెండర్లను సైతం ఎన్నికలకు ముందే కట్టబెట్టినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. 

బిజెపి ధర్నాను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ తిరుపతిలో బస్‌టికెట్ వెనుక జెరూసలెం గురించి ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డాయిరు. ‘ఈ విషయం ముఖ్యమంత్రి జగన్‌కు తెలుసా?’ అని ప్రశ్నించారు. ఈ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలం విషయంలో స్పందించినట్లే ఇక్కడ కూడా సీఎం స్పందించాలని కోరారు.

ఈ సందర్భంగా బిజెపి నేతలు తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్యమత ప్రచారానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుట్రలో భాగంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని, బాధ్యులైన వారిని భక్తుల ముందు నిలబెట్టాలని ఆయన కోరారు. 

కాగా, నెల్లూరు డిపో పరిధిలోని బస్సు టికెట్లు.. నిబంధనలకు విరుద్ధంగా తిరుపతి డిపోకు వెళ్లినట్లు గుర్తించామని మంత్రి చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి విషప్రచారానికి పాల్పడుతున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లంపల్లి తెలిపారు. దురుద్దేశపూర్వక ప్రచారంతో శ్రీవారి భక్తుల మనసు గాయపరుస్తున్నారని మంత్రి మండిపడ్డారు. టిటిడి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వెల్లంపల్లి హెచ్చరించారు.