భారత్, ఫ్రాన్స్‌ది ఇన్‌ఫ్రా బంధం

భారత్, ఫ్రాన్స్‌ది ఇన్‌ఫ్రా బంధం అని ప్రధాని  నరేంద్ర మోదీ తెలిపారు. ఇండియాలోని ఇన్.. ఫ్రాన్స్‌లోని ఫ్రా.. కలిస్తే ఇన్‌ఫ్రా అని మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు. పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఆయన భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్, ఫ్రాన్స్ ఏదైనా విజయం సాధించినప్పుడు రెండు దేశాల ప్రజలు ఎంతో సంతోషిస్తారని, 2018లో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పుడు భారత్ అభిమానుల ఆనందమే అందుకు ఉదాహరణ అని చెప్పారు. 

ఫుట్‌బాల్ క్రీడలో ఫ్రాన్స్‌కున్న అభిమానులు ఫ్రాన్స్ కంటే భారత్‌లోనే ఎక్కువని పేర్కొన్నారు. ఫుట్‌బాల్‌ను ప్రేమించే దేశానికి నేను వచ్చా. గోల్ ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసు. అత్యున్నత లక్ష్యాన్ని సాధించడమే. గతంలో అసాధ్యమనుకున్న వాటిని మేం గత ఐదేండ్లలో లక్ష్యాలుగా నిర్దేశించుకున్నాం అని తెలిపారు. సమిష్టి కృషితో వాటిని సాధించాం అని మోదీ పేర్కొన్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు అఖండ మెజార్టీని కట్టబెట్టింది కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదని, నవభారత నిర్మాణం కోసమని చెప్పారు. సామ్రాజ్యవాదం, ఫాసిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కేవలం తమదేశంలోనే కాకుండా ఫ్రాన్స్ గడ్డపైనా పోరాడిందని గుర్తు చేశారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని (రాజ్యాంగంలో తాత్కాలిక హోదాలో ఉన్న 370 నిబంధనను) రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో తాత్కాలికానికి చోటులేదని స్పష్టం చేశారు. గాంధీ, బుద్ధుడు, రాముడు, కృష్ణుడు నడయాడిన భారత్‌కు తాత్కాలిక నిబంధనను తొలిగించేందుకు ఏడు దశాబ్దాలు పట్టింది అని పేర్కొన్నారు.  

స్మారకం ప్రారంభించిన ప్రధాని 

1950, 66లో ఫ్రాన్స్‌లోని మౌంట్ బ్లాంక్ పర్వతం వద్ద చోటుచేసుకున్న రెండు ఎయిరిండియా విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల సంస్మరణార్థం ప్రధాని మోదీ  ఒక స్మారకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మౌంట్ బ్లాంక్ దిగువన నిద్ డి ఐగిల్ వద్ద ఈ స్మారకాన్ని నిర్మించారు. 1966 జనవరిలో జరిగిన ప్రమాదంలో భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబాతోపాటు పలువురు భారతీయులు సహా మొత్తం 106 మంది ప్రయాణికులు, 11 మంది విమాన సిబ్బంది మృతిచెందారు. 

1950లో చోటుచేసుకున్న ప్రమాదంలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. శోకంలోనూ భారత్, ఫ్రాన్స్ ఒక్కటిగా ఉన్నాయి. ఈ రెండు విమాన ప్రమాదాల్లో హోమీ బాబాతోపాటు పలువురు భారతీయులను కోల్పోయాం. వారికి ఘనంగా నివాళి అర్పిస్తున్నాం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.