ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరణ

కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చేవారం జరుపనున్న హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర పోలీస్ లు అనుమతి ఇవ్వలేదు. ఈ పర్యటన సందర్భంగా విద్యర్దులలోనే రెండు వర్గాలు తలపడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా పోలీస్ లు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉన్న ఉస్మానియాలో రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ నాయకులు మూడేళ్ళుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో అలజడి రేపడం ఆందోళన కలిగిస్తున్నది. రాహుల్‌కు అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా ఉస్మానియా విద్యార్థి సంఘాలు విడిపోయాయి. అడ్డుకుంటామని ఒకరు, సభ నిర్వహించి తీరుతామని మరొకకు సవాళ్లు చేసుకుంటున్నారు.

 

భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా రావచ్చునని, రాహుల్ పర్యటనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అనుకూల విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలు పేర్కొంటున్నాయి. ఓయూలో నిధుల కొరత, నిరుద్యోగ సమస్య వంటి సమస్యలను ఆయనకు వివరించే వీలుంటుందని భావిస్తున్నారు. పైగా, కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు కాలర్‌షిప్ ఇవ్వడంలేదని, దళితులపై దాడులు జరుగుతున్నాయని, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ రాహుల్‌కు వివరిస్తామని చెబుతున్నారు.

కాగ, రాహుల్ ప్రొఫెసర్, సైంటిస్టు కాదని, ఓ రాజకీయ నాయకుడని టి ఆర్  ఎస్ అనుకూల విద్యార్ధి సంఘ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. అన్నారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ 2014లో బిల్లు పెట్టలేదని, బిల్లు పెట్టడం ఆలస్యం కావడంతో వందలాదిమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారని, ఇన్ని దారుణాలు జరిగిన తర్వాత చివరిలో ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ బిల్లు పెట్టిందని పేర్కొంటున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణలో వ్యాపార సంస్థలు ఏపీకి తరలిపోతే తెలంగాణ యువత ఏంకావాలని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. ఏపీకి హోదా ఇస్తే.. తెలంగాణకు కూడా హోదా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీడబ్ల్యూసీలో తీర్మానం చేసిన తర్వాతే రాహుల్ తెలంగాణలో అడుగు పెట్టాలని స్పష్టం చేస్తున్నారు.