మోదీని భూతంలా చూపించలేం... ప్రధానిది జనం బాష

ప్రధాని నరేంద్ర మోదీని అన్నిసార్లు భూతంలా చూపించలేమని, అలా చేస్తే ఆయన్ను ఏమాత్రం ఎదుర్కోలేమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తన పార్టీ నేతలకు హితవు చెప్పారు. మోదీ  ప్రభుత్వ విధానం పూర్తిగా వ్యతిరేకంగా ఏమీలేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాన్నే తీసుకుంటే గతంలోకంటే పూర్తి భిన్నంగా ఉందని అంటూ కొనియాడారు. 

ప్రభుత్వ రాజకీయాలు, అలాగే ప్రభుత్వ విధానానికి అతీతంగా ప్రజాసంబంధాలను సృష్టించిన తీరూ భిన్నంగానే ఉందని చెప్పుకొచ్చారు. ఉదాహరణకు, ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన (పీఎంజేవై) ప్రధానిగా మోదీకి మంచి పేరు తెచ్చిపెట్టిందని కితాబు ఇచ్చారు.

2014-19 మధ్య మోదీ పనితీరు, 2019 ఎన్నికల్లో 37శాతానికి పైగా ఓట్లతో మళ్లీ అధికారంలోకి రాగలగడం వంటివాటిని పరిగణనలోకి తీసుకొని మోదీని గుర్తించాల్సిన అవసరం ఉందని అంటూ కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చేరువయ్యే భాషలో మోదీ మాట్లాడతారని కితాబు ఇచ్చారు. 

ప్రజలు గుర్తించే రీతిలో ఆయన పనితీరు ఉన్నందున మోదీని ఎదుర్కోవడం కష్టమని చెప్పారు. మనమంతా రైతులు కష్టాల్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేస్తుంటామని.. అయితే రైతుల కష్టాలకు, మోదీకి ఎలాంటి సంబంధం లేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.