సిద్దరామయ్యతోనే సంకీర్ణం కూలింది

కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి కూలిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యే కారకుడని మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి బాంబు పేల్చిన మరుసటి రోజే, ఆయన తండ్రి, మాజీ ప్రధాన మంత్రి  దేవెగౌడ మరో బాంబు పేల్చారు. సంకీర్ణ ప్రభుత్వం నడవడం మొదటినుంచీ సిద్దరామయ్యకు ఇష్టమే లేదని విరుచుకుపడ్డారు. అలాగే సర్కారు సరిగా పని చేయకుండా అడ్డుపడేవారని, అణగదొక్కడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారని తీవ్రంగా ఆరోపించారు. 

సంకీర్ణం ఏర్పడిన తొలి నాళ్ల నుంచే నా కొడుకు (కుమార స్వామి), సిద్దరామయ్యకు యుద్ధం మొదలైందని ఆయన తెలిపారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార స్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే వీరిద్దరి మధ్య (కుమార స్వామి, సిద్దరామయ్య) మధ్య భేదాభిప్రాయాలు మరింత ముదిరాయని దేవెగౌడ వెల్లడించారు. ఇది తన అభిప్రాయం కాదని, సిద్దరామయ్యకు సంబంధించిన అనుచరులే తనకు ఈ విషయం తెలిపారని ఆయన వెల్లడించారు. 

సిద్దరామయ్యను సంతృప్తి పరచడానికి తాము చాలా వాటిని వదులుకున్నామని, అయినా ఆయన తీరు ఏమాత్రం మారలేదని విరుచుకుపడ్డారు. సిద్దరామయ్య అనుంగు అనుచరుడికి కాలుష్య నియంత్రణ మండలి బోర్డు అధ్యక్ష పదవి ఇవ్వడానికి తాము అంగీకరించామని, కేబినెట్ హోదా ఉన్నాసరే ఆ పోస్టును ఇవ్వడానికి సిద్ధపడ్డామని, ఇంతకంటే ఇంకా ఏం చేయగలమని ఆయన ఎదురు ప్రశ్నించారు. 

తామేమీ ముఖ్యమంత్రి పదవి కోరుకోలేదని, సాక్షాత్తూ సోనియా గాంధీయే కుమార స్వామిని అందులో కూర్చోబెట్టారని దేవెగౌడ ప్రకటించారు. ఇక, రిసార్టు రాజకీయం గురించి వివరిస్తూ.... సిద్దరామయ్య కోరుకున్నవన్నీ ఇవ్వడానికి అప్పటి సీఎం కుమార స్వామి సిద్ధపడ్డారని, అయినా సరే, ఆయన అనుంగు ఎమ్మెల్యేలలతో రాజీనామా చేయించి, ముంబాయిలో క్యాంపులు పెట్టారని దేవెగౌడ ధ్వజమెత్తారు.