కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యం చేసుకోకూడదు

దాయాది పాకిస్తాన్‌కు గట్టి ఎదురదెబ్బ తగిలింది. కశ్మీరు అంశాన్ని భారత్, పాక్‌లే తేల్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ కుండబద్దలు కొట్టారు. మూడో పక్షం జోక్యం చేసుకోకూడదని, కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా ఆ దేశాలే పరిష్కరించుకోవాలని అన్నారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీ దాదాపు గంటన్నర పాటు చర్చించుకున్నారు.  కశ్మీర్ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతంలో ఎవరూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేయకూడదని తేల్చి చెప్పారు.

ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశాలతో పాటు మరిన్ని కీలక అంశాలను చర్చించుకున్నట్లు ఫ్రాన్స్ వర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం  ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ... జమ్మూకశ్మీర్ విభజన, 370 రద్దుపై తమకు ప్రధాని మోదీ వివరించారని ఆయన తెలిపారు. 

ఇరుదేశాలే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, మూడోపక్షం జోక్యం లేకుండా చూసుకోవాలని తాను మోదీకి సూచించినట్లు  ఇమ్మాన్యుయేల్ ప్రకటించారు. మరోవైపు ఇమ్మాన్యుయేల్ నుంచి ఇంత విస్పష్టమైన ప్రకటన రావడంతో పాక్ గొంతులో పచ్చి వెలిక్కాయ పడినట్లైంది. 

 ‘‘ప్రధాని(మోదీ) కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తిగా వివరించారు. అయితే కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశమని.. ఎలాంటి ఆందోళన పరిస్థితులకు తావివ్వకుండా చర్చించుకోవాలని, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టం చేశాను’’ అని తన వైఖరిని తెలిపారు.

ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలపైనా ఇరుదేశాధినేతలు చర్చించారు. శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. పారిస్‌ ఒప్పందంలో భారత్‌ పాత్ర ఎనలేదని కొనియాడిన ఫ్రాన్స్‌ అదే తరహాలో అంతర్జాతీయ అంశాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 

అంతకు ముందు మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. ఉభయ దేశాల ప్రజల సుభిక్షమే లక్ష్యంగా మైత్రి కొనసాగుతుందని పేర్కొన్నారు. 

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరుకున్నారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు.

మోదీ ఫ్రాన్స్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో అయిదు రోజుల పాటు ఈ నెల 26 వరకు పర్యటించనున్నారు. శనివారం బహ్రెయిన్‌ వెళతారు. ఆ దేశానికి వెళుతున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. 25న తిరిగి ఫ్రాన్స్‌ వచ్చి జీ-7 సదస్సులో పాల్గొంటారు.