రఫేల్‌ యుద్ధవిమానాల రాకకు రంగం సిద్ధం

రఫేల్‌ యుద్ధవిమానాల రాకకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలోనే భారత్‌ అమ్ముల పొదిలో చేరనున్నాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా వచ్చే నెలలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు వెళ్లి తొలి విమానాన్ని స్వీకరించనున్నారు. ఒకటి నుంచి నాలుగుదాకా యుద్ధ విమానాలను అప్పగించనున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. 

సెప్టెంబర్‌ 20న నిర్వహించే కార్యక్రమంలో ఉన్నతస్థాయి సైనికాధికారులతోపాటు, రఫేల్‌ తయారీ సంస్థ డసౌ ఏవియేషన్‌ సీనియర్‌ ఉన్నతాధికారులు కూడా హాజరవనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై ఫ్రాన్స్‌ అధికారులతో చర్చించేందుకు భారత వైమానిక దళానికి ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే పారిస్‌ చేరుకుంది. అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, పైలట్లకు శిక్షణ పూర్తిచేసి రఫేల్‌ యుద్ధవిమానాలకు స్వాగతం పలికేందుకు ఐఏఎఫ్‌ సంసిద్ధంగా ఉంది. 

హరియాణాలోని అంబాలా, పశ్చిమబెంగాల్‌లోని హసిమరలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లలో వీటిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. వీటిని భారత్‌కు అవసరమైన నిర్దిష్టమైన మార్పులతో రూపొందినట్లు సమాచారం. రూ.58 వేల కోట్ల వ్యయంతో 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకొన్న సంగతి తెలిసిందే. అణు సామర్థ్యం ఉన్న ఈ విమానాలు గగనతలం నుంచి గగనతలంపైకి, గగనతలం నుంచి భూతలంపైకి దాడులు చేయగలవు.