మాల్యా, నీరవ్‌లా ప్రవర్తిస్తున్న చిదంబరం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంను దేశం వదిలి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలతో బీజేపీ పోల్చింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం సెంట్రల్ ఏజెన్సీలతో సహకరించడం లేదని, కేసు దర్యాప్తునకు సహకరించకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా ఆయన ప్రవర్తిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి జీవీఎల్ నరసింహ ధ్వజమెత్తారు.  

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తాజా పరిణామాలపై నరసింహ మాట్లాడుతూ, చిదంబరం స్వేచ్ఛగా ఐఎన్‌ఎక్స్ మిడియా కేసును ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ చిదంబరం మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని విమర్శించారు. దర్యాప్తు సంస్థలకు ముఖం చాటేసి దేశం వదిలి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తరహాలో చిదంబరం వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.  ఇదెంత మాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిందబరం పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో జీవీఎల్ నరసింహా తాజా వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ చిదంబరం ఏదైనా చేయరానిది చేస్తే, అందుకు పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పని చేయబోవని చెబుతూ స్వతంత్రంగా పని చేయడానికి వాటికి అధికారాలు ఉన్నాయని చెప్పారు.