పతనం అంచున పుదుచ్చేరి ప్రభుత్వం

అంతర్గత కుమ్ములాటలతో 15 నెలలకే కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణం కుప్పకూలిన నెల రోజులకే దక్షిణాదిన కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో సహితం మూడేళ్ళుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ - డీఎంకే సంకీర్ణం పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు  మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత రంగస్వామి సారథ్యంలోని పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకరంగా మారింది. 

స్పీకర్‌గా వున్న వైద్యలింగం ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందడంతో ఖాళీ అయిన ఆ పదవికి శివకొళుందు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో స్పీకర్‌ శివకొళుందుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని రంగస్వామి, అన్నాడీఎంకే ఫ్లోర్‌ లీడర్‌ అన్బళగన్‌ సహా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, అన్నాడీఎంకే సభ్యులు అసెంబ్లీ కార్యదర్శి విన్సెంట్‌ రాయ్‌ వద్ద లేఖ సమర్పించారు.

దీనిపై ఎన్‌ఆర్‌ రంగసామి స్పందిస్తూ, కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో స్పీకర్‌ శివకొళుందుకు తరచూ పాల్గొంటున్నారని, మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ కాంగ్రెస్‌ సభ్యుడిగా నడుచుకుంటున్నారని ఆరోపించారు.  పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నందు వలన ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం వార్తలు పుదుచ్చేరి రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవల కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేసిన బీజేపీ.. సీఎంగా యడియూరప్పను పీఠమెక్కించింది.   ఆ బాణీలోనే నారాయణస్వామిని కూడా గద్దె దించి, తమకు మద్ధతుగా ఉన్న రంగస్వామిని ఆ స్థానంలో కూర్చోపెట్టేందుకు బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.