సందిగ్ధంలో రాజధాని అమరావతి నిర్మాణం

సింగపూర్‌ తరహా రాజధాని అంటూ గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కరించిన అమరావతి నిర్మాణం సందిగ్ధంలో పడింది. కొద్దిరోజులుగా ఉవ్వెత్తున వచ్చిన కృష్ణా నది వరదల నేపథ్యంలో రాజధానిలోని అత్యంత కీలకమైన కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. 

వరద ముప్పు. భారీ నిర్మాణ వ్యయం తదితర అంశాల దృష్ట్యా సచివాలయాన్ని నాగార్జున యూనివర్శిటీకి తరలించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో బొత్స సత్యనారాయణ వంటి సీనియర్‌ మంత్రి రాజధాని అంశాన్ని బాహాటంగా ప్రస్తావించడం, అసంతృప్తి వ్యక్తం చేయడం గమనిస్తే ఇదంతా ఒక పథకంలో భాగమేనని స్పష్టమవుతున్నది. 

కొద్దిరోజులుగా ఆందోళన సృష్టించిన కృష్ణా వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే, వరదలు రాజధానిలో సృష్టించిన భయానక వాతావరణాన్ని ప్రజలు అప్పుడే మరచిపోలేరు. ముఖ్యంగా ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత నివాసం కేంద్రంగా రోజుల తరబడి సాగిన వరద వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఆ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలోని ముంపు దృశ్యాలు పెద్ద ఎత్తున టివి ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తరలింపు అంశాన్ని ముందుకు తీసుకురావడం ప్రాధాన్యత సంతరింప చేసుకోంది. 

భారీ వర్షం పడితే చాలు నిర్మాణాల్లోకి నీరు చేరిపోవడం, రోడ్లు బురదమయం అయిపోయి వాహనాల రాకపోకలకు సమస్యలు ఏర్పడటం ఈ ప్రాంతంలో సాధారణ అంశం, దీంతో ఈ ప్రారతం రాజధానికి సరైనది కాదని, వేరే చోట ఏర్పాటుచేస్తే మంచిదని శివరామకృష్ణ కమిటీతోపాటు ఇతరనిపుణులు సూచించిన విషయాన్ని మరోసారి చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

పరిమిత ప్రాంతంలో పరిపాలనా రాజధానిని నిర్మించి, వికేంద్రీకరణ విధానంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరారధ్ర ప్రారతాల్లో కీలక పాలనా విభాగాలు ఏర్పాటుచేయాలని కూడా కమిటీ సూచించిన అంశాలనూ చర్చకు పెట్టడం ద్వారా రాజ ధానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన నుండి రాజధానికి చేరుకునే సమయానికి కొంతమేరకైనా ఈ అంశం చర్చనీయాంశం అయిఉండేలా చూడటమే ప్రభుత్వ వ్యూహమని భావిస్తున్నారు. 

ప్రస్తుతమున్న సచివాలయం, అసెంబ్లీతో పాటు హైకోర్టు భవనాలను గత ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాలుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి శాశ్వత భవనాలను నిర్మించాల్సిఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో నిర్మాణాల ఖర్చు ఎక్కువన్న అంశాన్ని మందుకు తీసుకువచ్చారు. ఈ వాదనతో ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కూడా కాస్త గట్టి నేల ఉండే మంగళగిరి, జాతీయ రహదారుల ప్రాంతానికి వీటిని తరలించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత తాత్కాలిక భవనాలను ఖాళీచేసి నాగార్జున విశ్వవిద్యాలయం వంటి ప్రత్యామ్నాయాలకు తరలించవచ్చు. 

ఈభవనాల నుండి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు జగన్మోహన్‌రెడ్డి అంత ఆసక్తి చూపడం లేదంటూ వస్తున్న వార్తలు కూడా గమనార్హం. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ కార్యాలయాలను కూడా విజయవాడ ప్రాంతానికి తరలించనున్నారు. మరోవైపు శివరామకృష్ణ కమిటీ ప్రస్తావించిన ప్రకాశం జిల్లాలోని దోనకొండ వైపునకు కూడా విస్తరించే అకాశం ఉంది.

కాగా, రాజధాని అంశంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కావాలనే కుట్ర చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాజధానిని మార్చాలనే ముంపు ప్రాంతమని ముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ ముద్ర వేసే పనులను ఇప్పటికే నిలిపివేశారని తెలిపారు. 'నా ఇంటిని ముంచాలనే కుట్రతో రైతుల పొలాలు, ప్రజల ఇళ్లు ముంచారు. కృష్ణా నది వరద నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించటం వల్లే అనేక ప్రాంతాలు, పొలాలు ముంపునకు గురయ్యాయి' అంటూ మండిపడ్డారు. 

రాజదాని నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, మౌలిక వసతులకు పోనూ వాటిలో 8 వేల ఎకరాలు మిగులుతాయని, వాటిని అమ్మినా పైసా ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించుకోవచ్చని సూచించారు.