బిజెపిలోకి టిడిపి అగ్రనేత దేవేందర్‌గౌడ్‌?

టిడిపి అగ్రనేత దేవేందర్‌గౌడ్‌ బిజెపిలోకి చేరేందుకు రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ హైదరాబాద్‌లో దేవేందర్‌గౌడ్‌ ఇంటికెళ్లి సమావేశమయ్యారు. దేవేందర్‌తోపాటు ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్‌ను పార్టీలోకి లక్ష్మణ్‌ ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వీరేందర్‌గౌడ్‌ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. వారు పార్టీలో చేరడం దాదాపు ఖాయమేనని.. మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 

దేవేందర్‌గౌడ్‌, వీరేందర్‌గౌడ్‌ బుధవారం దిల్లీకి వెళ్తున్నారు. ‘సామాజిక న్యాయం’పై దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. తర్వాత రాష్ట్రపతి కోవింద్‌తోపాటు ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో బిజెపి అగ్రనేతల్ని దేవేందర్‌గౌడ్‌ కలిసే అవకాశమున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

లోక్‌సభ ఎన్నికల సమయం నుంచే దేవేందర్‌గౌడ్‌తో బిజెపి నేతలు  టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆయన ఇంటికెళ్లి మద్దతు కోరారు. బిజెపిలోకి రావాలని దేవేందర్‌గౌడ్‌ను రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు కొద్దిరోజుల క్రితం వెళ్లి ఆహ్వానించారు. తాజాగా లక్ష్మణ్‌ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

టిడిపి నేతల్ని పెద్దసంఖ్యలో చేర్చుకున్న బిజెపి ఇప్పుడు కాంగ్రెస్‌తోపాట కొందరు  టీఆర్‌ఎస్‌ నేతలపై దృష్టి సారించింది. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో లక్ష్మణ్‌ ఇప్పటికే ఓసారి మాట్లాడగా ఆయన కొంత సమయం అడిగినట్లు తెలిసింది. మాజీ ఎంపీ విజయశాంతితో కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రాంమాధవ్‌ గతంలోనే సమావేశంకాగా కొంతకాలం తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. 

మాజీమంత్రి చంద్రశేఖర్‌తోపాటు ఉత్తర తెలంగాణలో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో బిజెపి నేతలు చర్చలు జరుపుతున్నారు.  టీఆర్‌ఎస్‌  లో రిజర్వుడ్‌ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలనూ సంప్రదిస్తున్నట్లు తెలిసింది.