చంద్రబాబుకు ధర్మబాద్ కోర్టు నోటిసులు

బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకు ధర్మబాద్ కోర్టు త్వరలో నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహారాష్ట్రకు సంబంధించిన స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు బాబ్లీ కోసం చంద్రబాబు పోరాడారని, ధర్మాబాద్ పోరాటంతో తెలుగుదేశం తెగువ ప్రజలు చూశారని ఈ వార్తలపై స్పందిస్తూ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసినందున చంద్రబాబు బెయిల్‌ తీసుకునేందుకు కూడా నిరాకరించారని గుర్తు చేసారు. ధర్మాబాద్‌ పోరాటంలో చంద్రబాబు తెగువ దేశమంతా చూశారని అంటూ చంద్రబాబును, టిడిపి నేతలను అరెస్టు చేసినా నాడు వెనక్కి తగ్గలేదని తెలిపారు. ధర్మాబాద్‌ కోర్టు నోటీసులు ఇస్తే చంద్రబాబు, టిడిపి నేతలు కోర్టుకు హాజరవుతారని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు.

అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.