నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ అహంకారం

నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ అనడం.. తన అహంకారాన్ని తెలుపుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ మండిపడ్డారు. కేటీఆర్ లాగా నడ్డా ప్యారాచూట్ పట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ లాగా తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నడ్డా కాదని అంటూ కేటీఆర్ పుట్టక ముందే నడ్డా రాజకీయాల్లో ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. 

నడ్డా కల్వకుంట్ల కుటుంబ బిడ్డ కాదు, భారతమాత ముద్దుబిడ్డ అనీ.. తండ్రి అధ్యక్షుడుగా ఉన్న పార్టీకి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న చరిత్ర టీఆర్ఎస్ ది అని విమర్శించారు. కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మాటలు వింటుంటే గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందంటున్న కేటీఆర్, తన చెల్లి కవితను అడిగితే చెబుతుందని లక్ష్మణ్ హితవు చెప్పారు. 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ సభ సక్సెస్ కావడంతో.. టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయని చెప్పారు.  ఇంత పెద్ద స్థాయిలో చేరికలు రాష్ట్ర బీజేపీలో ఇదే మొదటిసారి అని చెబుతూ అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. క్రియాశీల సభ్యత్వం నమోదు  ఆగస్ట్ 20తో ముగుస్తుందని, ఇప్పటి వరకు 12 లక్షల మంది పార్టీలో చేరారని చెప్పారు. 

టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాలపై పెడుతున్న ఖర్చులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ చరిత్ర సృష్టించబోతుందన్నారు. అప్పుడు టీఆర్‌ఎస్ నేతలు మెక్కినదంతా కక్కిస్తామని హెచ్చరించారు.   

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఇకపై తరుచూ రాష్ట్రానికి రానుండటంతో టీఆర్‌ఎస్‌కు నిద్రలేని రాత్రులేనని స్పష్టం చేశారు. కాగా,  హైదరాబాద్ ను యూటీ చేసే ఆలోచన బీజేపీకైతే లేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న ప్రతీ పోలింగ్ బూత్ లో జెండా ఎగురవేస్తాం. వస్తానని అమిత్ షా కూడా సానుకూలంగా తెలిపారు.