బిజెపిలోకి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి!

టిడిపి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు టిడిపి నేతల బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.  తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సహితం టిడిపిని వీడి బిజెపిలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశం కావడంతో ఈ విషయమై కధనాలు వెలువడుతున్నాయి. 

బీజేపీ కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న నేత ద్వారా ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో ఉండి కూడా ఆదినారాయణ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన టీడీపీలో చేరాక జమ్మలమడుగు టీడీపీ ముఖ్య నేతగా ఉన్న రామసుబ్బారెడ్డితో విభేదాలు తలెత్తాయి. చంద్రబాబు సయోధ్య కుదిర్చినా ఆదికి పరాజయం తప్పలేదు.

దీంతో కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డిపై రాజకీయంగా బాగా ఒత్తిడి ఉంది. ఎందుకంటే.. జగన్ ఇలాఖా అయిన కడప జిల్లాలో కొన్నేళ్లుగా ఆదినారాయణరెడ్డి ఆయననే సవాల్ చేస్తూ వచ్చారు. దాని ప్రభావం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆదినారాయణ రెడ్డిపై ఎక్కువగా ఉంది. 

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ ఒత్తిడిని అధిగమించాలంటే బీజేపీలో చేరడమే మార్గమని ఆదినారాయణ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన కీలక టిడిపి నేత, పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సన్నిహితుడిగా పేరున్న సీఎం రమేష్ గత నెలలో బీజేపీలో చేరడం తెలిసిందే.