పాక్ ప్రస్తుతం ఐసీయూలో ఉందని శివసేన ఎద్దేవా

 జమ్మూకశ్మీర్‌ విభజన,  ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో పాక్‌ వ్యవహార శైలిపై శివసేన మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులతో ప్రస్తుతం ఆ దేశం ఐసీయూలో ఉందని ఎద్దేవా చేసింది. కశ్మీర్‌ వ్యవహారంలో పాక్‌ అనవసర జోక్యాన్ని తన అధికార పత్రిక ‘సామ్నా’లో శివసేన ఎండగట్టింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కశ్మీర్‌ అంశంపై బాధపడే కన్నా ఆ దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించింది. 

ఐక్యరాజ్యసమితిలోని భద్రతా కౌన్సిల్‌ (యూఎన్‌ఎస్‌సీ)లో భారత్‌ ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ప్రయత్నించి.. చైనా, పాకిస్థాన్‌ విఫలమయ్యాయని పేర్కొంది. యూఎన్‌ఎస్‌సీ రహస్య భేటీలోనూ పాక్‌ సహా ఆ దేశానికి మద్దతుగా ఉండే దేశాలు సైతం ఖాళీ చేతులతోనే వెనక్కి రావాల్సి వచ్చిందని ఎద్దేవా చేసింది. 

 యూఎన్‌ఎస్‌సీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుకే నిలబడిందని పేర్కొంది. పాకిస్థాన్‌ లాంటి దేశాలకు మద్దతు ఇచ్చినందుకు చైనా కూడా అంతర్జాతీయ వేదికపై ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది. 

పాక్‌ ఆగడాలను నిలువరించేందుకు అమెరికా ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. చైనా లోపాయికారీగా పాక్‌కు మద్దతివ్వడంతోనే ఆ దేశం ఆగడాలు కొనసాగుతున్నాయని ఆరోపించింది. ఇప్పటికైనా కశ్మీర్‌ అంశంపై అనవసర జోక్యం తగ్గించుకొని తమ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదరికం, పెట్రేగిపోతున్న అరాచకాలను నిలువరించుకోవడంపై పాక్‌ దృష్టిపెట్టాలని ‘సామ్నా’ సూచించింది.