యుఏఈ, బెహ్రయిన్ లలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి యూఏఈ, బెహ్రయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. కశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యూఏఈ బహిరంగ మద్దతు ప్రకటించిన నేపథ్యంలోనే ప్రధాని అబూదాబి వెళ్లనుండడం గమనార్హం. భారత్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పాకిస్తానీయులను బెహ్రయిన్ ప్రభుత్వం సైతం అడ్డుకున్న సంగతి తెలిసిందే. 

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఈ నెల 6న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తి ఆ దేశ అంతర్గత వ్యవహారమని ఇటీవల యూఏఈ పేర్కొంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటన సందర్భంగా యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలు కూడా ఇరు దేశాధినేతల మద్య చర్చకు రానున్నాయి.

కాగా ఈనెల 24-25 తేదీల్లో ప్రధాని బెహ్రయిన్ వెళ్లనున్నారు. భారత ప్రధాని బెహ్రయిన్ పర్యటనకు వెళ్లనుండడం ఇదే మొదటి సారి కావడం విశేషం. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తానీయులు సహా కొందరు బంగ్లాదేశీయులు వ్యతిరేకించడంపై బెహ్రయిన్ గత వారంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈద్ ప్రార్థనలు ముగియగానే బెహ్రయిన్‌లో ర్యాలీ జరిగింది. 

దీనిపై తీసుకున్న చర్యలను బెహ్రయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ట్విటర్లో వెల్లడిస్తూ.. ఆందోళనకారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. కాగా కశ్మీర్ విషయంలో తమకు అండగా నిలవాలంటూ గతవారం బెహ్రయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను కోరిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. 

అన్ని అంశాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామనీ... కేవలం చర్చల ద్వారానే సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని ఇమ్రాన్‌కు ఖలీఫా తేల్చిచెప్పారు.