మూడు రాష్ట్రాలలో తిరిగి పాతవారే సీఎంలు

త్వరలో ఎన్నికలు జరుగనున్న మూడు రాష్ట్రాలలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులే తిరిగి అధికారం చేబడతారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టమైన సంకేతం ఇచ్చారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుత ముఖ్యమంత్రులే సారథ్యం వహించనున్నారని హర్యానాలో ఇటీవల జరిగిన ర్యాలీలో కరాఖండీగా తేల్చిచెప్పారు. 

హర్యానాకు తిరిగి మనోహర్‌లాల్ ఖతర్ తిరిగి సీఎం కానున్నట్లు అమిత్‌షా ర్యాలీలో స్పష్టం చేశారనీ. అసెంబ్లీ ఎన్నికలైన సైతం ఖట్టర్ నేతృత్వంలో జరుగుతాయని పార్టీలు వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, మహారాష్టల్రో ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, జార్ఖండ్‌లో ప్రస్తుత సీఎం రఘువీర్‌దాస్‌ల సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని షా స్పష్టంగా చెప్పినట్లు అధికార వర్గాల సమాచారం. 

హర్యానాలోని జింద్‌లో జరిగిన పార్టీ ర్యాలీలో షా మాట్లాడుతూ రాష్ట్రంలోని 90 స్థానాల్లో 75 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలనీ.. పార్టీకి మెజారిటీ ఇస్తే తిరిగి మనోహర్‌లాల్ ఖతర్ సీఎం అవుతారని చెప్పారు. ఈ ఐదు సంవత్సరాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు తమదైన శైలిలో పరిపాలన సాగించి పార్టీకి మంచి పేరు తెచ్చారని కితాబునిచ్చారు. 

ఈ ముగ్గురూ తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురాగలరన్న నమ్మకం బీజేపీకి కలిగించారని,  అందుకే ముందే ముగ్గురు సీఎం అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు షా తెలిపారు. 2014 ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ 47 స్థానాలు సాధించగా.. మహా రాష్ట్ర లో 288 స్థానాల్లో 122 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. అలాగే, జార్ఖండ్‌లోని 81 స్థానాల్లో 27 స్థానాలను కైవసం చేసుకొంది. 

ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. ‘కుంభకోణ రహిత, నిజాయితీ’ పరిపాలనను అందించారని.. అవినీతికి తావులేని పాలన అందివ్వడం వల్లే ముగ్గురినీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నట్లు షా ప్రకటించినట్లు సీనియర్ బీజేపీ నాయకుడొకరు పేర్కొన్నారు. ‘ఖతర్ అయితేనేమి.. ఫడ్నవిస్.. దాస్ ముగ్గురూ ప్రజల్లో క్లీన్ ఇమేజ్‌ను సంపాదించారని’ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణను మరింత ప్రతిబింబించేలా వీరు తమ రాష్ట్రాల్లో మరింత పెంచే విధంగా కృషి చేశారని భావిస్తున్నారు.