మున్సిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెబుదాం

మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలతో సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెబుదాం అని బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.  బహిరంగ సభ ముగిసిన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాత్రి కోర్‌కమిటీ భేటీలో, అంతకు ముందు పదాధికారుల సమావేశంలోనూ  పాల్గొంటూ  రాష్ట్రంలో అవినీతిపై న్యాయపోరాటం చేయాలని,  ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. 

‘‘తెలంగాణలో కష్టపడి పనిచేస్తే రానున్న ఎన్నికల్లో కాషాయజెండా ఎగరేయడం ఖాయం. కార్యక్రమం ఏదైనా పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి చేపట్టండి.  తెరాస సర్కారుపై పోరాటాలు చేయండి’’ అంటూ  దిశానిర్దేశం చేశారు. ‘‘సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా గట్టిగా చేయండి. వారంరోజుల పాటు కార్యక్రమాలు ఉండాలి’’ అని సూచించినట్లు తెలిసింది. 

‘‘సీనియర్‌ నేతల్లో కొన్ని అనుకూలతలతో పాటు లోపాలున్నాయి. కొందరు పూర్తి ప్రయత్నాలు చేయడం లేదు. కార్యకర్తల్ని పెంచడం లేదు’’ అంటూ ఘాటైన వ్యాఖ్య కూడా చేసినట్లు సమాచారం. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను నడ్డా సమావేశంలో వివరించారు. ‘‘అక్టోబరు 11 నుంచి 31 వరకు మండల కమిటీలు.. నవంబరు 11-30 వరకు జిల్లా కమిటీలు.. డిసెంబరు 1-15 వరకు రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగాలి’’ అని తెలిపారు.