జేఎన్‌యూకు మోదీ పేరుపెట్టాలి

దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి ప్రధాని నరేంద్రమోదీ పేరు వచ్చే విధంగా ఎంఎన్‌యూ అని పెట్టాలని బిజెపి ఎంపీ హన్స్‌రాజ్‌ హన్స్‌ ప్రతిపాదించారు. యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 

కశ్మీర్‌ గురించి మాట్లాడుతూ మన పూర్వీకులు చేసిన తప్పిదం కారణంగా ఇవాళ ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ధ్వజమెత్తారు. కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

దేశానికి మోదీ ఎంతో చేశారని, జేఎన్‌యూకు కూడా ఎంతో చేశారని హన్స్‌రాజ్‌ తెలిపారు. అందుకే మోదీ పేరు వచ్చే విధంగా ‘మోదీ నరేంద్ర యూనివర్సిటీ’ (ఎంఎన్‌యూ) అని పేరు పెట్టాలని ప్రతిపాదించినట్లు కార్యక్రమం అనంతరం మీడియాతో తెలిపారు. 

కాగా, పేరు మార్పు ఆయన వ్యక్తిగత విషయమని, మోదీ పట్ల ఉన్న గౌరవాన్ని ఆయన చాటుకున్నారని బిజెపి ఎంపీ, ఆ పార్టీ దిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే జేఎన్‌యూ ప్రాంగణంలో పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వందేమాతరం, భారత్‌ మాతాకీ జై నినాదాలు వినిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు.