బుజ్జగింపు రాజకీయాలతోనే పాపిష్టి ట్రిపుల్ తలాక్

పాపిష్టి పద్ధతి ట్రిపుల్ తలాక్ సుదీర్ఘ కాలం దేశంలో కొనసాగడానికి బుజ్జగింపు రాజకీయాలే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో శ్యామప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్‌ను నేరపూరితం చేస్తూ చట్టం రూపొందించడాన్ని సమర్థించుకున్నారు. ఇది లింగ సమానత్వాన్ని తీసుకొస్తుందని తెలిపారు. 

భారత ప్రజాస్వామ్యానికి బుజ్జగింపు రాజకీయాలతోపాటు కుల, వారసత్వ రాజకీయాలు ముప్పుగా పరిణమించాయని అమిత్‌షా చెప్పారు. అన్ని రంగాల్లో ప్రగతి సాధన ద్వారా మోదీ సర్కార్ ఈ మూడు సమస్యలకు చరమగీతం పాడుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. కోట్ల మంది ముస్లిం మహిళలకు పీడకలగా మారిన ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా చేయడం వల్ల కేవలం ముస్లింలే లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. 

92.1 శాతం మంది ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌ను నేరమయం చేయడానికి మద్దతునిస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలకు కేంద్రమైన కాంగ్రెస్ పార్టీ వల్లే ఇప్పటివరకు పాపిష్టి ట్రిపుల్ తలాక్ సంప్రదాయం కొనసాగిందని, అయినా నిస్సిగ్గుగా ఆ పార్టీ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని వ్యతిరేకించిందని ధ్వజమెత్తారు. 

షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును తారుమారుచేసేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేసిందని, అది దేశ చరిత్రలో ఒక చీకటి రోజు కాగలదని విమర్శించారు. దేశంలో అభివృద్ధి లక్ష్యాల సాధనకు, సామాజిక ఐకమత్యానికి బుజ్జగింపు రాజకీయాలు అవరోధంగా మారాయని తెలిపారు. ట్రిపుల్ తలాక్ ఇస్లామిక్ సంప్రదాయం అయితే పలు ముస్లిందేశాల్లో ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. 1922-63 మధ్య 19 దేశాలు ట్రిపుల్ తలాక్ విధానాన్ని ఎత్తేశాయని గుర్తు చేశారు.