జల క్రీడా ఆకర్షణలతో ‘అమరావతి మెరీనా’

రాజధాని అమరావతిలో పర్యాటకులకు ముఖ్య ఆకర్షణగా నిలిచే మూడు ప్రాజెక్టులకు సంబంధించి సీఆర్‌డీఏ సమావేశంలో ముందడుగు పడింది. జల క్రీడా ఆకర్షణలతో నిలిచే అమరావతి మెరీనా, నదీ అభిముఖంగా నిర్మించనున్న అమరావతి రిసార్టు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆతిధ్యం కల్పించే అమరావతి కన్వెన్షన్ సెంటర్.. లకు సంబంధించి ఆయా నిర్మాణ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు సమక్షంలో ఎల్ఓఏ (లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్) అందుకున్నారు.

‘అమరావతి మెరీనా’ను కోస్తా మెరైన్ సంస్థ నెలకొల్పుతోంది. అమరావతిలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు అవుతున్న తొలి ప్రాజెక్టు ఇదే. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 60-బెర్త్ మెరీనా, ఇతర అనుబంధ జల క్రీడా కార్యకలాపాల కేంద్రం ఏర్పాటుకానున్నది. సెయిలింగ్, పవర్ బోటింగ్ వంటి జల క్రీడలకు సంబంధించిన శిక్షణాకేంద్రం, బోట్ లాంచ్, బోట్ రిపేర్ ఫెసిలిటీస్, బోట్ల కోసం ప్రత్యేకంగా డ్రై స్టాక్ స్టోరేజ్ ఫెసిలిటీస్, రిక్రియేషనల్ కార్యకలాపాలు, క్లబ్ హౌస్ ఇందులో వుంటాయి.

అమరావతి రిసార్టును విజయవాడలోని ఒకప్పటి ప్రముఖ హోటల్ కంధారి ఇంటర్నేషనల్ యాజమాన్యం నెలకొల్పుతోంది. ఇది కూడా పీపీపీ పద్ధతిలోనే నిర్మాణం అవుతోంది. రెండెకరాల విస్తీర్ణంలో 50 గదులతో 3 నక్షత్రాల రిసార్టుగా దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆరు మాసాల వ్యవధిలో దీన్ని నిర్మించాల్సివుంటుంది. 

‘అమరావతి కన్వెన్షన్ సెంటర్’ వరుణ్ హాస్పిటాలిటీ సంస్థ పీపీపీ పద్దతిలో నిర్మిస్తోంది. 5 ఎకరాల స్థలంలో ఈ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానున్నది. ఇందులో 2 వేల మంది అతిధులకు సరిపోయేట్టుగా ఈ మల్టీ పర్పస్ కన్వెన్షన్ సెంటర్‌, వెయ్యిమంది సరిపడా సామర్ధ్యంతో బ్యాంకిట్ హాలు నిర్మిస్తున్నారు. 12 నెలల కాల వ్యవధిలో దీన్ని ఏర్పాటు చేయాలి.