తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం

తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకుందని బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌నడ్డా భరోసా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో టిడిపికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీగా బిజెపిలో చేరిన సందర్భంగా నడ్డా ప్రసంగిస్తూ బీజేపీలోకి వలసలు చూసి.. టీఆర్‌ఎస్‌కు కడుపు మండుతోందని  ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబుతూ  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసేది ఒకటి.. చెప్పేది మరోకటని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు.  

సీఎం కేసీఆర్‌ వాస్తు పేరుతో సచివాలయాన్ని కూలగొడుతున్నారని మండిపడుతూ హరితహారం నిధులకు లెక్కలు చూపరని, ఆడిటింగ్‌ కూడా లేదని దుయ్యబట్టారు. ఈ పథకంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలు, ఎస్సీలకు చోటు లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 

రూ.30వేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచారని పేర్కొంటూ ప్రాజెక్టుకు పవిత్రమైన పేరు పెట్టి కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. మిషన్‌ కాకతీయ పథకం.. మిషన్‌ ఫర్‌ కమీషన్‌గా మారిందని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇచ్చిన నిధులను వినియోగించుకోలేకపోయారని మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్లు ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు? అని నడ్డా ప్రశ్నించారు.  

రజాకార్లలో పోరాడి గెలిచిన గడ్డపైకి రావడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎంతో సాహసంతో తెలంగాణ ప్రజలు అలుపెరుగని పోరాటం జరిపి రజాకార్లను తరిమికొట్టారని కొనియాడారు. నిరంకుశ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విముక్తి కలిగించారని గుర్తు చేశారు. 

దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే సత్తా కేవలం బీజేపీకే ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ స్వప్రయోజనాలే ముఖ్యమని.. దేశ ప్రయోజనాలు అవసరం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని దేశ ప్రజలు కోరుకున్నారని.. అందుకే తమ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని చెప్పారు. 

కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆర్టికల్‌ 370ని ఇంతకాలం కొనసాగించారని ఆరోపించారు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండకూడదన్నారు. అందుకే ఒక దేశం-ఒకే రాజ్యాంగం విధానాన్ని మోదీ అమలు చేసి చూపించారని కొనియాడారు. 

ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంతో 55 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే ఆయుష్మాన్‌ పథకాన్ని తెలంగాణలో అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘దేశంలోని అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ‘నేను.. నా తర్వాత నా కుమారుడు’. బిజెపి మినహా అన్ని పార్టీల్లోనూ ఇదే పద్ధతి. తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారులు రూ.కోట్లు దండుకుంటున్నారని గుర్తు చేశారు. భారత్‌ త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తాం. ప్రధాని ఆవాస్‌ యోజనతో ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు నిర్మిస్తాం. ప్రతి స్వయం సహాయక బృందానికి రూ.5లక్షల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కల్పిస్తాం. అడగ్గానే తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేశామని నడ్డా వివరించారు.