యువత చేతిలో సురక్షితంగా భూటాన్‌ భవిష్యత్తు

భూటాన్‌ భవిష్యత్తు యువత చేతిలో సురక్షితంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌లో ఉన్న ప్రధాని మోదీ ఆదివారం ఆ దేశ రాజధాని థింపూలోని రాయల్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత వారిపైనే ఉందని తెలిపారు. 

భూటాన్‌-భారత్‌ ప్రజల మధ్య ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తుచేస్తూ దీంతో ఇరు దేశాల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు దృఢంగా మారాయని పేర్కొన్నారు.   ఈ ఆధునిక ప్రపంచంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని చెబుతూ వాటన్నింటినీ ఒడిసిపట్టుకోవాలని సూచించారు. తద్వారా భవిష్యత్తు తరాలకు పునాదులు వేయాలని హితవు చెప్పారు. 

ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రతి సవాల్‌కి యువకులు వినూత్న పరిష్కారాలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్కడి ప్రజల ఆప్యాయతతో పర్యాటకులు పులకించి పోతున్నారని పేర్కొంటూ శుక్రవారం తనని చిరునవ్వుతో చిన్నారులు దారిపొడవునా స్వాగతం పలికిన తీరు తనని ముగ్ధుణ్ని చేసిందని పేర్కొన్నారు. 

అసాధారణమైన పనులు చేయగలిగే శక్తి, సామర్థ్యాలు భూటాన్ విద్యార్థులకు ఉన్నాయని పేర్కొంటూ ‘‘మీలో నిజమైన సత్తాను గుర్తించి, పరిపూర్ణ తపనతో పని చేయండి’’ అని విద్యార్థులకు చెప్పారు. ప్రతి సవాలుకు వినూత్న పరిష్కారం కనుగొనగలిగిన యువత మనకు ఉందని చెప్పారు. ఎటువంటి పరిమితులు నియంత్రించకుండా జాగ్రత్తపడాలని సూచించారు. నూతనోత్తేజంతో పని చేయడానికి ఇంత కన్నా మంచి తరుణం మరొకటి ఉండదని తెలిపారు.  

గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత్‌లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉందని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం గురించి వివరించారు. తాను రాసిన ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకంపై బుద్ధుని బోధనల ప్రభావం ఎంతగానో ఉందని తెలిపారు. 

తమకంటూ ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని నిర్మించుకునే క్రమంలో భూటాన్‌కు చెందిన యువ శాస్త్రవేత్తలు భారత్‌కు రానుండడం పట్ల సంతోషం ప్రకటించారు. భూటాన్‌ చేపట్టే ప్రతి పనిలో భారతీయులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. డిజిటల్‌, అంతరిక్ష రంగం నుంచి విద్యా రంగం వరకు అన్నింట్లో సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 

ప్రసంగం అనంతరం మోదీ థింపూలోని ఆ దేశ దివంగత నేత డ్రక్‌ గ్యాల్పో స్మారకం వద్ద నివాళులర్పించారు. రెండోసారి ప్రధాని అయిన తర్వాత భూటాన్‌లో తొలిసారి పర్యటిస్తున్న మోదీ.. శనివారం అక్కడ 740 మెగావాట్ల మాంగ్‌దెఛు జలవిద్యుత్‌ కర్మాగారాన్ని ప్రారంభించారు.

చారిత్రక సింటోఖా కోటలో భూటాన్‌ ప్రధాని లోటే థేర్సింగ్‌తో ఆయన చర్చించారు. అంతరిక్ష పరిశోధన, ఐటీ, విద్యుత్‌, విద్య లాంటి రంగాల్లో ఇరుదేశాల మధ్య 10 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రూపే కార్డును భూటాన్‌లో మోదీ ఆవిష్కరించారు.