పాక్‌తో చర్చలు జరిగితే ఇక పీవోకే పైనే..

ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ   పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించే ఉంటాయని తేల్చి చెప్పారు. 

నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హరియాణాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్‌నాథ్‌ పాల్గొంటూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్‌ ఆందోళన చెందుతోందని చెప్పారు. 

‘ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో తమకు మద్దతు పలకాలని పాక్‌ ఇతర దేశాల తలుపు తడుతోంది. మనం ఏం తప్పు చేశాం. ఎందుకు మనం భయపడాలి. ఈ విషయంలో అగ్ర రాజ్యం అమెరికానే పాక్‌కు మొట్టికాయలు వేసింది. భారత్‌తో చర్చలు జరుపుకొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది.’’ అని గుర్తు చేశారు. 

ఉగ్రవాదం ద్వారా భారత్‌లో అస్థిర వాతావరణం నెలకొల్పి, బలహీన పర్చాలని పాక్‌ యోచిస్తోందని రాజ్‌నాథ్‌ ఆరోపించారు. వారి ఎత్తుగడలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో మన ప్రధాని మోదీకి సరిగ్గా తెలుసని స్పష్టం చేశారు. 

‘‘బాలాకోట్‌ వైమానిక దాడి జరిగిన అనంతరం, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తమపై ఎలాంటి దాడులు జరగలేదని బుకాయించారు. తాజాగా భారత్‌ బాలాకోట్‌ కన్నా పెద్ద దాడులకు ప్రణాళిక రచిస్తోందని ఆయనే ఆరోపించారు. అంటే, బాలాకోట్‌ దాడులు జరిగినట్లు ఆయన అంగీకరించినట్లే కదా..’’ అని రాజ్‌నాథ్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు.