పెట్టుబడులకు రండి..అండగా ఉంటాం : సీఎం జగన్‌

‘పారిశ్రామిక అభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు అండగా మేముంటాం’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవాసభారతీయులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. 

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌  డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. అందరూ తమ తమ గ్రామాల అభివృద్ధికోసం సహకరించాలని కోరారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం అందరిది అని, ఎప్పుడొచ్చినా అందరికి తాను తోడుగా ఉంటానని చెప్పారు.  

అమెరికాలో ఉంటున్నా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడి అమెరికన్‌ తెలుగు కమ్యూనిటీ పోషించిన పాత్ర ఎంత గొప్పదో తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. అమెరికాలోనే భారతీయులు దాదాపుగా 41 లక్షలు ఉన్నారని, అందులో దాదాపు 4లక్షలు తెలుగు వారే ఉండడం గర్వంగా ఉందని చెప్పారు.  తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించమే కాకుండా, ప్రతి మనిషి, ప్రతి సామాజిక వర్గం గౌరవం కూడా పొంపెందించేలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా చర్యలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండున్నర నెలల్లోనే తీసుకుందని తెలిపారు. 

రెండున్నర నెలల పరిపాలనలో ఏకంగా 19 బిల్లులను బడ్జెట్‌ సమావేశంలో తీసుకొచ్చాం. పెన్షన్లు పెంచాం. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, నిరుపేదలకు 25లక్షల ఇళ్ల పట్టాలు ఈ ఏడాదిలోనే ఇవ్వబోతున్నాం. పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్‌, యుద్ద ప్రాదిపదికన జలయజ్ఞంలో ప్రాజెక్టులు, దశల వారిగా మద్య నిషేదానికి నాంది పలికామని గర్వంగా చెబుతున్నా. రెండున్నరనెలల్లోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సెక్రెటేరియట్లను తీసుకొస్తున్నాం. గ్రామ వాలంటీర్లను ఇప్పటికే నియమించాం. మూడు నెలల కాలంలోనే 4లక్షగా మందికి వీటి ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు.