భూటాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం

భూటాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్‌తో శనివారం విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధన, విమానయానం, విద్య, విద్యుత్‌, ఐటీ రంగాల్లో రెండు దేశాల మధ్య 10 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. ‘సమావేశంలో మేం విస్తృత చర్చలు జరిపాం. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచేందుకు అపార అవకాశాలు ఉన్నాయి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.'

తాజాగా కుదిరిన పది ఎంఓయూల వల్ల రెండు దేశాల మైత్రీ బంధం కొత్త శక్తిని సంతరించుకుంటుందని ఇరువురు నేతలు పేర్కొన్నారు. భారత్-్భటాన్ సంబంధాలను మరింతగా మెరుగు పరుచుకునేందుకు ఎంతో అవకాశం ఉందని, ముఖ్యంగా ఆర్థిక, సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎంతో అవకాశం ఉందని మోదీ తెలిపారు  

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రెండోసారి భూటాన్‌ పర్యటనకు వెళ్లిన మోదీ.. మాంగ్డెచ్చు జలవిద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. రెండు దేశాల మధ్య జల విద్యుత్‌ ఉత్పత్తి సంబంధాలకు ఐదు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో స్మారక స్టాంపులను ఆవిష్కరించారు. 

పురాతన సింటోఖా డ్జాంగ్‌లో కొనుగోళ్లు జరుపడం ద్వారా భూటాన్‌లో రూపే కార్డును ప్రధాని మోదీ ఆవిష్కరించారు.ఇరుదేశాల మధ్య డిజిటల్‌ చెల్లింపులు, వాణిజ్యం, పర్యాటక రంగాల్లో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు దోహదపడుతుందన్నారు.‘సార్క్‌ కరెన్సీ స్వాప్‌ ఫ్రేమ్‌వర్క్‌'లో భాగంగా భూటాన్‌కు కరెన్సీ మార్పిడి పరిమితిని పెంచేందుకు భారత్‌ సానుకూలంగా ఉందని తెలిపారు. విదేశీ మారక అవసరాల కోసం అదనంగా 100 మిలియన్‌ డాలర్లను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. 

భారత్‌కు చెందిన నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌, భూటాన్‌కు చెందిన డ్రక్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ నెట్‌వర్క్‌ అనుసంధానానికి సంబంధించిన ఈ-ఫలకాన్ని ఇరువురు నేతలు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అలాగే భూటాన్‌లో దక్షిణాసియా ఉపగ్రహ సేవల వినియోగం కోసం ఇస్రో సహకారంతో అభివృద్ధి చేసిన శాట్‌కామ్‌ నెట్‌వర్క్‌, గ్రౌండ్‌ ఎర్త్‌ స్టేషన్‌ను సంయుక్తంగా ప్రారంభించారు. 

భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ మాట్లాడుతూ.. పరిమాణం పరంగా భూటాన్‌, భారత్‌ వేర్వేరైనా విశ్వాసాలు, విలువలు, స్ఫూర్తి ఇరుదేశాలకూ ఒక్కటేనన్నారు. అంతకుముందు, తషిచోడ్జాంగ్‌ ప్యాలెస్‌లో ప్రధానికి సంప్రదాయ స్వాగతం లభించింది. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యాల్‌ వాంగ్‌చుక్‌తో ప్రధాని సమావేశమయ్యారు.