వరద నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలం

వరద నియంత్రణలో  వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి విమర్శించారు. ఎగువ రాష్ట్రాలు వరదపై ముందే సమాచారం అందించినప్పటికీ.. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన విశాఖలో ఆరోపించారు. ముంపు గ్రామాల ప్రజలకు కనీసం రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు నిత్యావసరాలు, ఆహారం, మంచినీరు అందించాలని కోరారు.

వరద ఉద్ధృతిని గవర్నర్‌ పరిశీలించారని, ఆయన నివేదిక అందించాక.. సాయంపై కేంద్రం నిర్ణయం ఉంటుందని సుజనా చౌదరి వెల్లడించారు. గతంలో ఉన్న సమస్యలు ఈ 70 రోజుల్లో రెట్టింపయ్యాయని దుయ్యబట్టారు. వేలుకు దెబ్బతగిలిందని మందు వేసుకోకుండా నరుక్కుంటామా? అని వైసిపి నేతలను ప్రశ్నించారు. పరిపాలించే తీరు ఇదికాదని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు చెప్పారు.

సిఎం జగన్‌ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని సుజనాచౌదరి ఆరోపించారు. చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ పాలసీ ఉందని విమర్శించారు. అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందని అంటూ వ్యక్తిగత కక్షలతో రాష్ట్రానికి వైసిపి తీరని నష్టం చేస్తోందని ధ్వజమెత్తారు. రివర్స్‌టెండరింగ్‌ గిమ్మిక్కులా కనిపిస్తోందని దుయ్యబట్టారు.