సంక్రాంతిలోపు రజనీకాంత్ పార్టీ, బిజెపితో పొత్తు !

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వచ్చే ఏడాది సంక్రాంతిలోపు కొత్త పార్టీ ప్రారంభించి, బిజెపితో పొత్తు పెట్టుకొని వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. శాసనసభ ఎన్నికలే తమ లక్ష్యమని ఆయన ప్రకటించిన నేపథ్యంలో అందుకు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలు మాత్రమే తమ లక్ష్యమంటూ ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రజనీకాంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. 

కశ్మీర్‌ వ్యవహారంలో బిజెపి నిర్ణయంపై రజనీ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి.   ఈ ఏడాది ఆఖరులో కొత్త పార్టీ పేరు, జెండా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా కూడా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. దీనిని రజనీకాంత్‌కు సన్నిహిత మిత్రుడు, కాంగ్రెస్‌ ప్రముఖుడు కరాటే త్యాగరాజన్‌ వ్యాఖ్యలు నిర్ధారిస్తున్నాయి. 

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రజనీకాంత్‌ పార్టీ ప్రారంభిస్తారని, అప్పుడు కచ్చితంగా తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరుణానిధి, జయలలిత లేని శూన్యతను ఆయన మాత్రమే భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్తలు తమిళనాట రాజకీయ పక్షాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రజనీని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర రాజకీయాలు తిరుగుతాయనే విశ్లేషణలు సైతం తెరపైకి వస్తున్నాయి. 

కేంద్రంలోని బిజెపి నాయకులతో రజనీకాంత్‌కు ఉన్న సాన్నిహిత్యం ఇటీవల మరింత బహిర్గతం కావడంతో పార్టీ ప్రారంభించిన తర్వాత ఆ పార్టీతో రజనీకాంత్‌ పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మోదీ, అమిత్‌షాలను కృష్ణార్జునులతో పోల్చడం, కశ్మీర్‌ పునర్విభజనపై బిజెపి సర్కార్‌ను అభినందించడం వంటి ఘటనలతో రాష్ట్రంలోని బిజెపియేతర పక్షాలు రజనీకాంత్‌పై ధ్వజమెత్తాయి. 

ఇంతలో రజనీకాంత్‌కు మద్దతుగా బిజెపి రాష్ట్ర నేతలు గళం విప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటి ద్వారా తర్వాతి ఎన్నికల్లో బిజెపితో రజనీకాంత్‌ పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు బయలుదేరాయి. 

జయలలిత మృతికి ముందు వరకు పోయెస్‌గార్డెన్‌ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో నివసిస్తున్న రజనీకాంత్‌ చుట్టూ తమిళనాడు రాజకీయాలు తిరిగే అవకాశముందని, అందువల్ల మళ్లీ పోయెస్‌గార్డెన్‌ కీలకం కానుందని విశ్లేషణలు తెరపైకి వచ్చాయి.