సీఎం జగన్ అపాయింట్‌మెంట్ దొరకటం లేదు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో ఇప్పటివరకూ తనకు అపాయింట్‌మెంట్ దొరకలేదని బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు విచారం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు చెప్పాలంటే ఒక్కరోజులోనే సమయం దొరికేదని గుర్తుచేశారు. 

జగన్ పనితీరు చూస్తుంటే.. ఆయనకు సరైన సలహాదారులు లేరనిపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజావేదికను ఒకరోజులో కూల్చిన ప్రభుత్వం.. 70 రోజులు గడుస్తున్నా ఇసుక విధానంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఇసుక లేకపోవడంతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

 అధికారులతో కుమ్మక్కైతేనే కాంట్రాక్టుల విషయంలో అవినీతి సాధ్యమని స్పష్టం చేశారు. కేవలం గుత్తేదారులనే ప్రభుత్వం లక్ష్యం చేసుకుంటుందని విమర్శించారు.

ఇలా ఉండగా,  కృష్ణా కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం చుట్టుపక్కల పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయిన వహారంపై అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద రాద్ధాంతం జరగడాన్ని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన 'కొంప మునిగి' హైదరాబాద్ జారుకున్నారు. వారిద్దరి 'తోక నేతలు' చేస్తున్న చర్చ"ఇల్లు మునిగిందా.. లేదా"? ఇల్లు సంగతి వదిలేయండి. మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోంది అని కన్నా ట్వీట్ లో తీవ్ర విమర్శలు గుప్పించారు.