అవినీతిలో నంబర్‌ వన్‌ కేసీఆర్‌

తెలంగాణలో అవినీతికి అదుపు లేకుండా పోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రజా సేవలు అందించాల్సిన ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో నెంబర్ వన్‌గా తేలిందని మండిపడ్డారు.

కాళేశ్వరాన్ని మానస పుత్రికగా చెప్పుకొనే కేసీఆర్ రూ.30వేల కోట్ల ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు పెంచి 6 శాతం కమీషన్ దండుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో కమీషన్ తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును బూచిగా చూపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని ధ్వజమెత్తారు. 

‘రూ.500 కోట్లు వృథా చేసి అసెంబ్లీ కడతామంటూ చెబుతున్న కేసీఆర్‌.. ఆరోగ్యశ్రీ బకాయిలు మాత్రం చెల్లించట్లేదు. బస్తీల్లో పేదలు డెంగీ, మలేరియా వ్యాధులతో మంచాన పడితే పట్టించుకునేవారే  లేరు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు వెబ్‌సైట్‌లో పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నారు.5 శాఖలు జారీ చేసిన 1400 జీవోలు వెబ్‌సైట్‌లో కనపడకుండా చేశారు' అంటూ లక్ష్మణ్ విమర్శల వర్షం కురిపించారు. 

దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల గురించి పట్టించుకోని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ భవనాల కోసం మాత్రం ఎకరం రూ. 100కే అప్పనంగా అప్పగించారని ధ్వజమెత్తారు. 16 మంది సీఎంలు చేసిన అప్పులు రూ. 62 వేల కోట్లైతే.. కేసీఆర్‌ ఒక్కడే రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. 

పార్టీ కార్యాలయాలకు రూపాయికి ఎకరం ఇస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని చెబుతూ డీపీఆర్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పథకం అంటూ ప్రజలకు రంగుల సినిమా చూపెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణా రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేశారని మండిపడుతూ  పార్టీకి ఆకర్షితులై బిజెపిలో చేరుతుంటే అవుట్‌ డేటెడ్ నాయకులంటూ వారిని ఎద్దేవా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేటీఆర్‌ పరమత సహనం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. దానిగురించి మాట్లాడే ముందు,  హిందూ దేవతలను అవమానించిన ఒవైసీపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. కాళేశ్వరం డీపీఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా అడగడం ఎంతవరకు సమంజసమో  ప్రభుత్వమే సమాధానం చెప్పాలని హితవు చెప్పారు. డీపీఆర్ ఇవ్వకపోయినా.. తెలంగాణా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.