భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు 50 ఏండ్లు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. 50 ఏండ్ల కిందట గుడారాల్లో పురుడు పోసుకున్న ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నది. అంతరిక్ష రంగంలో సంచలన విజయాలు సాధిస్తున్నది. ఈ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను.. ఆంక్షలను.. అవమానాలను తట్టుకొని ఇప్పుడు తలెత్తుకొని నిలబడ్డది. ఉపగ్రహాలను ఎడ్లబండిలో మోసుకొచ్చిన కాలం నుంచి.. సూర్యుడి మీదికే వ్యోమనౌకను పంపే స్థాయికి ఎదిగింది. 

అగ్రరాజ్యాలతో సమానంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు భవిష్యత్ తరాలు ఎదుర్కొనబోయే సమస్యలపై దృష్టిసారించింది. వాటికి పరిష్కారాలు వెతికేందుకు కంకణం కట్టుకున్నది. 

ఇస్రో 1969 ఆగస్టు 15న ప్రారంభమైంది.1957లో రష్యా మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలపై దృష్టిసారించింది. హోమీబాబా నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. 1962లో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌ను ఏర్పాటు చేసింది. భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఈ సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇది తర్వాతి కాలంలో ఇస్రోగా రూపాంతరం చెందింది. 

ఇస్రో 1963లో మొదటిసారిగా కేరళలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించింది. ఇవి కేవలం 30-70 కిలోల పేలోడ్స్‌ను మాత్రమే తీసుకెళ్లగలవు. 1979లో భూ స్థిర కక్ష్యకు ఉపగ్రహాలను చేర్చగల మొదటి ఉపగ్రహ వాహక నౌక శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్‌ఎల్వీ) రూపుదిద్దుకున్నది. ఆ తర్వాత 150 కిలోల బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లగల ఏఎస్‌ఎల్వీ, 1860 కిలోల పేలోడ్స్‌ను తీసుకెళ్లగలిగే పీఎస్‌ఎల్వీను తయారుచేశారు. ఇప్పుడు నాలుగు టన్నుల పేలోడ్స్‌ను మోసుకెళ్లగలిలే జీఎస్‌ఎల్వీ రాకెట్ ఇస్రో దగ్గర ఉన్నది. దీనినే బాహుబలిగా పిలుస్తున్నారు. 

తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగిస్తూ అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రో అగ్రగామిగా నిలుస్తున్నది. గత మూడేండ్లలోనే 239 విదేశీ ఉపగ్రహాలను పంపి రూ.6,289 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇస్రో కలిసి నిసార్ అనే ప్రాజెక్టును చేపట్టాయి. నాసా ఒక విదేశీ అంతరిక్ష పరిశోధన సంస్థ సాయం తీసుకోవడం ఇదే మొదటిసారి.   

ఇస్రో ఇప్పటివరకు సమాచార, సాంకేతిక, రక్షణ రంగాలకు ఉపయోగపడేలా ఉపగ్రహాలను రూపొందించి.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు భవిష్యత్ తరాలు ఎదుర్కొనబోయే నీరు, ఇంధన వనరుల లభ్యత వంటి సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు.   

మొదట్లో శాటిలైట్లను, రాకెట్ విడిభాగాలను సైకిళ్లు, ఎడ్లబండ్లపై తీసుకొచ్చి బిగించేవారు. వరుసగా ప్రయోగాలు విఫలమయ్యేవి. ఈ క్రమంలో ఎన్నో అవహేళనలు ఎదురయ్యాయి. 1998లో పీఎస్‌ఎల్వీని ప్రయోగించినప్పటి నుంచి ఇస్రో దశ తిరిగింది.ఈ వాహక నౌక ఇస్రో నమ్మినబంటుగా ఉంటూ అత్యధిక విజయాలు అందించింది. విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి చేర్చి అంతరిక్ష వాణిజ్యంలోకి అడుగుపెట్టేలా చేసింది.

 క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని ఇవ్వకుండా రష్యా అవమానిస్తే.. ఇస్రో కసిగా ప్రయత్నించి సొంతంగా క్రయోజెనిక్ ఇంజిన్‌ను సృష్టించింది. ఒకేసారి భిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను విడిచిపెట్టడం, 104 ఉపగ్రహాల ప్రయోగం, చంద్రయాన్-1, 2, మంగళ్‌యాన్, సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య మిషన్‌లు చేపట్టి ఇస్రో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది.