భద్రతామండలిలో పాక్ కు చుక్కెదురు

కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వివాదంగా గుర్తించారని, భద్రతామండలి సమావేశమై చర్చించడమే దీనికి సాక్ష్యమని ఐరాసలో పాకిస్థాన్  రాయబారి మలీహా లోధి చైనా అండతో ప్రయత్నించినా చివరకు చుక్కెదురైనది. జమ్ముకశ్మీర్ అంశం పూర్తిగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక అంశమని, తాము అందులో తలదూర్చబోమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించినట్టు తెలిసింది. పైగా, ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని చెప్పినట్టు తెలిసింది. 

భద్రతా మండలిలోని ఐదు సభ్యదేశాల్లో ఒక్క చైనా మాత్రమే పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిందని, మిగతా దేశాలన్నీ భారత్ వాదననే సమర్థించాయని సమాచారం. కాగా, భద్రతా మండలి సమావేశానికి తమ దేశం తరఫున ఒక ప్రతినిధి హాజరవుతారని, ఇందుకు అనుమతించాలని పాకిస్థాన్ ఐరాస భద్రతామండలిని కోరింది. అయితే మండలి ఆ అభ్యర్థనను తిరస్కరించింది. 

ఐరాస భద్రతామండలి అధ్యక్షురాలు, పోలండ్‌కు చెందిన జువన్నా రోయెంకా నేతృత్వంలో భద్రతామండలి శుక్రవారం సమావేశమైంది. ఐదు శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులు, 10 ఆహ్వానిత సభ్య దేశాల ప్రతినిధులతో అంతర్గత సంప్రదింపులు (క్లోజ్డ్ డోర్ కన్సల్టేషన్స్) జరిపింది. గంటకుపైగా సాగిన ఈ సమావేశం వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. జమ్ముకశ్మీర్ సమస్య పూర్తిగా ద్వైపాక్షిక అంశమని, భారత్-పాక్ కలిసి చర్చించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.

కశ్మీర్ అంశంలో భారత్ తీసుకున్న చర్యలకు రష్యా మద్దతు పలికింది. ఐరాసలో రష్యా శాశ్వత ఉప ప్రతినిధి దిమిత్రి పాలియాన్‌స్కై మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ద్వైపాక్షిక అంశం. తలదూర్చకపోవడమే మంచిది అని హితవు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకోవడమే సమావేశం ప్రధాన లక్ష్యమని అంటూ ఇదొక సాధారణ ప్రక్రియ అని చెప్పారు. 

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై భారత్-పాక్ కలిసి శాంతియుత వాతావరణంలో చర్చించుకోవాలని ఐరాసలో చైనా రాయబారి జాంగ్ జున్ సహితం హితవు చెప్పారు. పక్షపాత ధోరణికి తావివొద్దని, ఉద్రిక్తతలు పెరిగేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అయితే జమ్ముకశ్మీర్ అంశంలో భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని, ఇది అంతర్జాతీయ వివాదంగా మారిందని ఆరోపించారు. 

జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. భారత్ నిర్ణయం చైనా సార్వభౌమత్వాన్ని సవాల్ చేసేదిగా ఉన్నదని, సరిహద్దులో శాంతికి విఘాతం కలిగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 
మరోవైపు మండలి సమావేశానికి ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేశారు. ఈ అంశంపై దాదాపు 12 నిమిషాలు మాట్లాడారు.